సమ్మెలోకి వెళుతున్నాం... తేల్చుకునేదాకా వదలం
ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు.
ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంతో సమ్మకు వెళ్లితీరతామని చెప్పారు. ఈ నెల 5 వ తేదీ నుంచి ప్రభుత్వానికి సహాయ నిరాకరణను తెలియజేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. బీఆర్టీఎస్ రోడ్డులో జరిగిన లక్షలాది మంది ఉద్యోగులను ఉద్దేశించి ఉద్యోగ సంఘాల నేతలు ప్రసంగించారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఒక చరిత్ర అని, ఉద్యోగుల ఉద్యమం కూడా ఒక చరిత్రగా నిలిచిపోతుందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్ప రాజు వెంకటేశ్వర్లు అన్నారు.
డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకూ....
అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ తమను వెయిట్ చేయించి అవమానపర్చిందని అన్నారు. ఈ ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకూ ఆందోళన కొనసాగుతుందని వారు చెప్పారు. ప్రజల నుంచి తమకు సహకారం అందుతుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలుగా చర్చలకు వెళితే అవమానించారని, తమ వెనక లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నట్లు మర్చిపోవద్దని హెచ్చరించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు ప్రజారోగ్య శాఖ, ఆర్టీసీ, విద్యుత్తు ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్లనుండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారనుంది.