ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. సంక్రాంతికి అమలు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో మరికొంత కాలం వెయిట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సంక్రాంతి అంటే ఇంకా పథ్నాలుగు రోజులు మాత్రమే ఉంది. అంటే మరో పదిహేను రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఉచిత బస్సు మహిళలకు అందించే పథకాన్ని ప్రారంభిస్తే అనుకూలత కన్నా వ్యతిరేకత వచ్చే అవకాశముందన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. అన్నీ ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ప్రధానంగా ఈ ఉచిత బస్సు అమలవుతున్న కర్ణాటక, తెలంగాణలో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.
పొరుగు రాష్ట్రాల్లో...
తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటం ఒక కారణమయితే.. ప్రధానంగా పురుషుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తమకు బస్సుల్లో కూర్చోవడానికి కూడా సీట్లు దొరకడం లేదని పురుషులు తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేస్తున్నారు. బస్సుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం, హడావిడిగా అమలు చేయడం వల్ల మహిళలే ఎక్కువ బస్సులను ఆక్రమిస్తుండటంతో పురుషులు ప్రయాణం చేయడం కూడా కష్టంగా మారింది. దీంతో పాటు ఆటో కార్మికుల నుంచి కూడా ప్రభుత్వంపై వ్యతిరేక బాగా కనపడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల ను చూసిన తర్వాతనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
సాధ్యాసాధ్యాలను పరిశీలించి...
ఎందుకంటే సంక్రాంతి నాటికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించాలన్నా అందుకు తగిన బస్సులను ముందుగా అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఆ పని జరగలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులతో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే అది బూమరాంగ్ అవుతుందని భావించిన ప్రభుత్వం కొంత కాలం పాటు వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్థానంలో మరొక హామీని సంక్రాంతికి అమలు చేస్తే బాగుంటుందన్న సూచన కూడా వెలువడింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ ఉచిత బస్సు ప్రయాణంపై చర్చకు రాకపోవడంతో ఈ అనుమానాలు బయలుదేరాయి. ఆర్టీసీ అధికారులకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now