Andhra Pradesh : సూపర్ సిక్స్ హామీలపై తేలే సమయం దగ్గరలోనే ఉందిగా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై వచ్చే నెలలోనే స్పష్టత రానుంది. బడ్జెట్ సమావేశాల్లో బయటపడనుంది
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పటయి ఐదు నెలలుకావస్తుంది. ఇప్పటి వరకూ ఎన్నికలసమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో కొన్నింటిని మాత్రమే అమలు చేసింది. ప్రధానంగా పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటు తాజాగా ఉచిత గ్యాస్ సిలిండ్ పథకాన్ని దీపావళి రోజు నుంచి లాంచ్ చేస్తుంది. ఉచిత ఇసుక, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేయడం, మెగా డీఎస్సీ వంటి వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తొలి రోజునే సంతకాలు చేశారు. కానీ సూపర్ సిక్స్ హామీలలో ఒకటి రెండు మాత్రమే అమలు చేయడంతో ఇటు ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. అదే సమయంలో విపక్షాలకు విమర్శలు చేయడానికి ఒక దారి దొరికినట్లయింది.
ఇప్పటి వరకూ..
అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల గురించి తేల్చేసే సమయం దగ్గర పడింది. బడ్జెట్ సమావేశాల్లో వీటిపై స్పష్టత రానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లయినా పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దీనివల్ల సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టత రాకుండా ఉంది. తల్లికి వందనం లాంటి ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి నెల నుంచి అమలు చేయడానికి సిద్ధమని మంత్రల ప్రకటనతో తెలిసినా, దానికి ఎంత నిధులు కేటాయిస్తారన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా అంతే. త్వరలో అంటూ మంత్రులు ఊరించడం మినహా నిధుల కేటాయింపు, అమలు తేదీపై స్పష్టత రాకపోవడంతో దానిపై విపక్షాలు నిలదీస్తున్నాయి.
రెండో వారంలో...
ఈనేపథ్యంలో నవంబరు రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. నవంబరు 11వ తేదీన గవర్నర్ ప్రసంగాన్ని నిర్వహించే వీలుంది. నవంబరు 12వ తేదీన రాష్ట్ర పూర్తిస్థాయిబడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తులు కూడా ప్రారంభించారు. దాదాపు బడ్జెట్ పై అంకెలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు సంక్షేమపథకాలను అమలు చేయాలంటే ఎక్కువ నిధులు అవసరం. అందుకు అవసరమైన నిధుల సమీకరణ పై అనేక రకాలుగా అధికారులు ప్రయత్నాలు చేశారు. కొంత మేరకు సఫలమయ్యారు.
దేనికి ఎంత నిధులు...
కానీ సూపర్ సిక్స్ హామీలన్ని అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నది అధికారుల వాదన. ఇప్పటికే ఐదు నెలల్లోనే కొత్త ప్రభుత్వం నలభై ఏడు వేల కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించింది. ఇంకా తేవాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సానుకూలత ఉండటంతో భవిష్యత్ లో పరిస్థిితి మెరుగు పడుతుందని భావిస్తున్నారు. ప్రతిపద్దుకూ ఖచ్చితంగా లెక్కలు బడ్జెట్ లో చూపించాలి. అందుకే సూపర్ సిక్స్ హామీలకు ఏ మేరకు నిధులను కేటాయించనుందన్నది నవంబరు 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేపెట్టే బడ్జెట్ లో తేలనుంది. అప్పటికి గాని హామీల అమలుపై కొంత మేరకు స్పష్టతరానుంది. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.