బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఉత్తర దిశగా వాయుగుండం కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని, విశాఖకు 450 కిలో మీటర్ల . దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మారిన సమయంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అది వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షం...
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలోని అనేక ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది. గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు.
పంటలకు నష్టమే...
మత్స్యకారులు ఆదివారం వరకూ చేపల వేటకు వెళ్లొద్దని నిషేధించారు. తీర ప్రాంత ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రంలో అలజడి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో కురుస్తున్న వర్షాలు వరి, పత్తి, పొగాకు వంటి పంటలను దెబ్బతినేలా చేశాయి. నేడు విశాఖ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు నేడు మూసివేయాలని కోరారు. ఇక నదులు, వాగులు దాటే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే పర్యాటక ప్రదేశంలో నీటి వనరుల వద్ద కూడా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ బీచ్ ల వద్ద పర్యాటకులు లోపలకి వెళ్లకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now