High Alert: పొంచి ఉన్న ముప్పు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా
బుడమేరు మరోసారి టెన్షన్ పెడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షాల కారణంగా బుడమేరుకు ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. సోమవారం ఉదయం బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. గుణదల, సింగ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజుల్లో గోదావరికి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అనేక గ్రామాలు వరదల్లో చిక్కుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.