AndhraPradesh: ఏపీలో వరదల కారణంగా అంత మంది చనిపోయారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా 45 మంది చనిపోయారని;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా 45 మంది చనిపోయారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మరణించగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మరణించారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 6.44 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. 246 పునరావాస శిబిరాల్లో 49 వేల మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నట్టు ప్రభుత్వం తమ ప్రకటనలో తెలిపింది. వరదల కారణంగా 3,913 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, 20 జిల్లాల్లో 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. 12 జిల్లాల్లో 19 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు కూడా ప్రభుత్వం తెలిపింది.
నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం బ్యారేజిని పరిశీలించారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని పరిశీలించారు. వరదల కారణంగా కొట్టుకొచ్చిన బోట్ల కారణంగా బ్యారేజీ లోని 67, 69 నెంబరు గేట్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న గేట్లకు కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చారు. ప్రకాశం బ్యారేజి వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల నిపుణుడు కన్నయ్య నాయుడితో మాట్లాడారు. కొత్తగా అమర్చిన కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు.