Andhra Pradesh : ఈరోజు ఏపీలో పెన్షన్ ఫెస్టివల్.. వృద్ధుల చేతుల్లో ఏడు వేల రూపాయల నగదు..దివ్యాంగులకు పదిహేను వేలు

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉదయం నుంచి వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు అందచేస్తున్నారు.

Update: 2024-07-01 01:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అమలులోకి రాగానే వచ్చిన మొదటి నెల ఇచ్చిన హామీని అమలులోకి తెచ్చింది. ఈరోజు ఉదయం నుంచి వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు అందచేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తం కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఈ నెల నుంచి చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ప్రతి నెల వృద్ధులకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పింఛను అందచేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అమలులోకి తెచ్చారు. ఏప్రిల్, మే, జూన్ నెల వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈ నెల వృద్ధులకు స్వయంగా అందచేయనున్నారు.దివ్యాంగులకు ఈనెల పదిహేను వేల రూపాయలు అందనున్నాయి.

ఇంటికి వెళ్లి...
గత ప్రభుత్వం మాదిరిగానే వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వాలంటీర్లు మాత్రం కాదు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ఈ పింఛనును ఈరోజు ఉదయం నుంచి అందచేస్తున్నారు. తమ చేతుల్లో ఏడు వేల రూపాయలు ఒక్కసారి రావడంతో వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేలు వణుకుతూ అందుకున్న ఆ చేతులు.. ధైర్యంగా ఏడు వేల రూపాయల అందుకోవడానికి పండుటాకులు సిద్ధమయ్యారు. ఈ నెల పింఛను మొత్తం తో పాటు చంద్రబాబు నాయుడు సంతకంతో కూడిన లేఖను కూడా లబ్దిదారులకు అందచేస్తున్నారు. ఒక్కొక్క సచివాలయం ఉద్యోగికి యాభై గృహాలను కేటాయించారు.
ఏడు వేల చొప్పున...
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం మొత్తం 65.12 లక్షల మంది పింఛను దారులకు ఏడు వేల రూపాయల చొప్పున పింఛను మొత్తాన్ని ఈరోజు నుంచి చెల్లించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 4,408 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. చంద్రబాబు కూడాస్వయంగా లబ్దిదారుడి ఇంటికి వెళ్లి నగదును అందచేశారు. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఒక లబ్దిదారుడికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఈ పింఛను పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాలని చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. లబ్దిదారులందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రమంతటా పింఛన్ల పండగ జరుపుకోవాలని టీడీపీ తరుపున నేతలు ఆదేశించడంతో పల్లెల నుంచి పట్టణాల వరకూ పండగ వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News