Andhra Pradesh : వంద రోజుల్లోనే ఇంత మార్పా? కూటమి నేతల మధ్య డిష్యూం డిష్యూం
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇటీవలే వంద రోజులు దాటింది. కానీ కూటమి పార్టీల్లో విభేదాలు అప్పుడే తలెత్తాయి
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇటీవలే వంద రోజులు దాటింది. అయితే పిఠాపురం నుంచి ఆదోని వరకూ, ధర్మవరం నుంచి ఒంగోలు వరకూ కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కూటమికి ముందు కుదిరిన పొత్తులతో మూడు పార్టీలు ఏకమై జగన్ ప్రభుత్వాన్ని అయితే ఓడించగలిగారు కానీ, తమ నియోజకవర్గంలో గెలిచిన నేతలు ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు. ఇగోలు విభేదాలకు ప్రధాన కారణం. ఎవరి పార్టీ వారిదే. ఎవరి జెండా వారిదే. ఎవరి అజెండా వారిదే. తమ పార్టీ క్యాడర్ కోసమే కూటమి పార్టీలు పట్టుబడుతుండటంతో మిత్రపక్షాలకు చెందిన నేతల్లో విభేదాలు రచ్చకెక్కాయని చెప్పక తప్పదు. ఇందులో ఏ పార్టీ నేతదీ తప్పు కాదు.
ఎవరి క్యాడర్ ను వారు...
ఎందుకంటే ఎవరి క్యాడర్ ను వారు కాపాడుకోవాలి. ఎవరి జెండాను వారు పదిలంగా ఉంచుకోవాలి. 2024 ఎన్నికలలో కూటమి పార్టీల క్యాడర్, నేతలు అందరూ కలసికట్టుగా పనిచేశారు. టిక్కెట్ దక్కకపోయినా కలసి మెలసి జెండాలను మోశారు. అయితే కూటమి పార్టీల మధ్య ఎన్నికల అనంతరం మాత్రం విభేదాలు అధినాయకత్వాలను కలవరపెడుతున్నాయి. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలోనూ టీడీపీ, జనసేనల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఎస్‌వీఎస్ఎన్ వర్మ ప్రభుత్వం ఏర్పాటయిన నెల రోజుల నుంచే అసంతృప్తితో ఉన్నారు.
పిఠాపురం నియోజకవర్గంలో...
అక్కడ జనసేన నేతలకు, వర్మకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది. లోకల్ నాయకత్వం మధ్య అస్సలు పొసగడం లేదు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు అమితుమీ సిద్ధమవుతున్నారు టీడీపీ, జనసేన నేతలు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరిగేవి అయినా అధికారం ఉన్న పార్టీలు డైరెక్టర్ల పదవులను పంచుకుని ఏకగ్రీవం చేసుకునే వీలుంది. ఐదు డైరెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగానే జనసేన నేతలు తమ అభ్యర్థులను రంగంలోకి దించారు. దీంతో వర్మ కూడా తన అనుచరులను పోటీకి దించి సై అన్నారు. రెండు పార్టీల నుంచి చెరో ఐదుగురు పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల మధ్య పోటీ అనివార్యమయింది. ఒక రకంగా రెండు పార్టీలూ బలనిరూపణకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నియోజకవర్గాల్లోనూ...
ఇక ఆదోని నియోజకవర్గంలో అక్కడి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడసూపాయి. ఇద్దరు వేర్వేరుగా ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో క్యాడర్ కూడా రెండుగా విడిపోయారు. ఆధిపత్య పోరే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక ధర్మవరంలో బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ నియామకం ఇందుకు కారణం. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. జనసేనలో చేరిన బాలినేని వదిలేది లేదని చెబుతున్నారు. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే అనేక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతల మధ్య రచ్చ రంబోలా పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారనున్నాయి.