Chandrababu : చంద్రబాబుకు ఎంత కష్టం.. కుదురుకునేలాగా ఈ నష‌్టం నుంచి బయటపడేదెలా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ఇంకా కుదురు కోలేదు. ఇంతలో వరదలు ముంచెత్తాయి;

Update: 2024-09-06 04:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తుంది. ఇంకా కుదురు కోలేదు. పాలనలో సంస్కరణలను తేవడానికి చంద్రబాబు అన్ని సమీక్షలను చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. మరో వైపు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది. ఇక నెలవారీ పింఛన్లు, ఉద్యోగుల జీతభత్యాలను, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛన్లను ప్రతి నెల ఒకటోతేదీనే పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేందుకు చంద్రబాబు మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. కొంత సక్సెస్ అయ్యారు. మరోవైపు అమరావతి, పోలవరం నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు.

ఆకస్మికవరదలు...
ఇలా పనులు వేగంగా వెళుతున్న దశలో ఆకస్మిక వరదలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. ఇది ఎవరూ పూడ్చలేని విషాదం. భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం కూడా జరిగింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చంద్రబాబు గత ఆరు రోజుల నుంచి అవిశ్రాంతంగా వదర సహాయక చర్యలపై ఒక రకంగా యుద్ధమే చేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ వరద బాధితులకు సరైన సమయంలో సాయం అందేలా చూసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చేయగలుగుతున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆరు రోజుల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి మరీ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
పెద్దసవాల్...
ఇప్పుడు ఈ కష్టం నుంచి బయటపడటం చంద్రబాబుకు పెద్ద సవాల్. ముందు వరద నీరు తగ్గిపోయి ప్రజలను ఆదుకోవాలి. వారిని ఆదుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపింది. ఈరోజు నష్టం వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. ఎంతో కొంత సాయం అందిస్తుంది కానీ, భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని మాత్రం ఆశించలేం. అందుకే జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కేంద్రం మనసు కరుగుతుందా? లేదా? అన్నదే ప్రశ్న.
మద్దతుగా ఉండాల్సిన...
మరోవైపు సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, దాతలు విరాళాలు అందిస్తున్నా ఇంతటి కష్టం నుంచి గట్టెక్కడం అంటే చంద్రబాబుకు అంత సులువు కాదు. పెను సవాల్ అని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు క్రైసిస్ ను ఎదుర్కొంటున్నారు. నిద్రాహారాలు మాని వరద బాధితులకు అవసరమైన సాయం అందించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ ఏ ప్రభుత్వమైనా పూర్తి స్థాయిలో ఆదుకోలేదు. విమర్శలు కూడా అంతే స్థాయిలో వినపడతాయి. అందుకే దేనికి తలొగ్గకుండా చంద్రబాబు ముందుకు అడుగు వేయాలి. కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. కానీ చంద్రబాబుకు ఈ సమయంలో మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Tags:    

Similar News