ఆ ఎమ్మెల్యేలకు నో టికెట్ : తేల్చేసిన సీఎం జగన్
జూన్ 23న వాలంటీర్లకు జగనన్న సురక్ష కార్యక్రమంపై శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. 24వ తేదీ నుంచి నెలరోజుల పాటు..
రాబోయే ఎన్నికల్లోపు పనితీరు మెరుగుపరచుకోని ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న సురక్ష, గడపగడపకూ మన ప్రభుత్వంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన సమీక్షలో.. జగన్ 15 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే ఆధారంగా.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 15 మంది ఎమ్మెల్యేలు బాగా వెనుకబడ్డారని పేర్కొన్నారు. వారంతా తమ పనితీరు మెరుగుపరచుకుంటేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తుందని తెలిపారు.
జూన్ 23న వాలంటీర్లకు జగనన్న సురక్ష కార్యక్రమంపై శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. 24వ తేదీ నుంచి నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. 11 రకాల ధృవపత్రాలను కావాల్సిన వారి వివరాలు తీసుకుని వెంటనే జారీ చేయాలని సూచించారు. అలాగే రేషన్ కార్డుల్లో పేర్లు జత చేయడం, కార్డుల విభజన తదితర కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. అలాగే కుల, ఆదాయ ధృవీకరణ, జనన, మరణ, వివాహ, తదితర వాటికోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకే వెళ్లి ధృవపత్రాలను అందించాలని సూచించారు. అదేవిధంగా 9 నెలల్లో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలిచేందుకు అందరూ కష్టపడి పని చేయాలని సూచించారు. కష్టపడిన వారికే పార్టీ టికెట్ ఇస్తుందని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు.