"జగనన్న సురక్ష" : ఏపీకి మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలి ?
జూన్ 23 నుంచి జులై 23 వరకే జరిగే ఈ కార్యక్రమంలో పట్టణ, గ్రామ వాలంటీర్లు, గృహ సారధులు, సచివాలయ సిబ్బంది..
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో "జగనన్న సురక్ష" కార్యక్రమం ప్రారంభం కానుంది. "జగనన్న సురక్ష" యాప్ ను సీఎం జగన్ ప్రారంభించడంతో కార్యక్రమం మొదలవుతుంది. జూన్ 23 నుంచి జులై 23 వరకే జరిగే ఈ కార్యక్రమంలో పట్టణ, గ్రామ వాలంటీర్లు, గృహ సారధులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటారు. "జగనన్నకు చెబుదాం"లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆ సమస్యలను మండల, పురపాలక స్థాయిల్లోని అధికారిక బృందాలు పరిష్కరిస్తాయి. జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ బృందాలు వారానికొకసారి సంఘాలను సందర్శించి పరిష్కరించని ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు.
అలాగే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అందుతున్నాయో వివరించనున్నారు. ఆయా పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారో గృహ సారధులు ప్రజలకు తెలుపుతారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ ను ఎందుకు గెలిపించాలో చెప్పే ప్రయత్నంలో భాగంగానే.. "జగనన్న సురక్ష" కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, లబ్ధిదారులకు అందించిన ప్రయోజనాలను వివరిస్తారు. రేషన్ కార్డుల్లో పేర్లు జత చేయడం, కార్డుల విభజన తదితర కార్యక్రమాలతో పాటు.. కుల, ఆదాయ ధృవీకరణ, జనన, మరణ, వివాహ, తదితర పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్లకే వెళ్లి ధృవపత్రాలను అందించనున్నారు.