Jallikattu : రంగంపేట జల్లికట్టుకు జల్ది పోదాం.. పదండి.. అక్కడ ఏం జరుగుతుందో మీకైమైనా తెలుసా?
చిత్తూరు జిల్లా రంగంపేటలో మరికాసేపట్లో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి
సంక్రాంతి పండగ వేళ జరిగే అతి ముఖ్యమైన ఆటలో జల్లికట్టు ఒకటి. కోనసీమలో కోడిపందేలు జరిగినట్లుగానే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహిస్తారు. కనుమ రోజు జరిగే ఈ జల్లికట్టు పోటీల కోసం వేల సంఖ్యలో జనం హాజరవుతుంటారు. చిత్తూరు జిల్లా రంగంపేట జల్లికట్టు పోటీలకు ప్రసిద్ధి. పోలీసులు అనేక ఏళ్లుగా దీనిపై ఆంక్షలు విధించినా.. అనేక మంది ఈ పోటీలో గాయపడుతున్నా ఆట మాత్రం ఆగదు. పోటీ జరగాల్సిందే. సినీనటుడు మోహన్ బాబు కుటుంబంతో సహా ప్రతి పండక్కీ ఈ జల్లికట్టు పోటీలను వీక్షించడానికి వెళుతుంటారు.
ఐదు వందల ఎడ్లు సిద్ధం...
చిత్తూరు జిల్లా రంగంపేటలో జరిగే ఈ జల్లికట్టు పోటీలకు ఇప్పటికే ఐదు వందల ఎద్దులను సిద్ధం చేశారు. మరికాసేపట్లో జల్లికట్టు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు రాయలసీమలోని అన్ని ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో జనం రంగంపేటకు వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పోటీలకు వస్తుండటంతో ఈ పోటీల ప్రాముఖ్యత మరింత పెరిగింది.
కనుమ పండగ రోజే...
కనుమ పండగ రోజు మాత్రమే రంగంపేటలో జల్లికట్టు పోటీలు జరుగుతాయి. ఈరోజు పశువులను అందంగా అలంకరిస్తారు. పశువుల కొమ్ములకు ప్రత్యేకంగా పలకలను అమరుస్తారు. వాటిలో బంగారు, వెండి వస్తువులను కూడా ఉంచుతారు. ఈ పశువులను రంగంపేటలోని వీధుల్లో వదిలి పెడతారు. అయితే ఈ ఎద్దులకు ఎదురెళ్లి వాటిని లొంగదీసుకుని పలకలు తమ సొంతం చేసుకోవాలి. అది రంగంపేట స్సెషాలిటీ. కొనదేరిన కొమ్ములతో ఉండే ఎద్దులను వంచడం అంటే ఆషామాషీ కాదు. అందుకే అనేక మంది ఈ పోటీల్లో గాయాలపాలవుతుంటారు. గాయపడిన వారికి వెంటనే ప్రాధమిక చికిత్స చేసేందుకు కూడా సదుపాయాలుంటాయి.
ఇది భిన్నంగా...
తమిళనాడులో జరిగే జల్లికట్టుకు, రంగంపేటలో జరిగే జల్లికట్టుకు చాలా తేడా ఉంది. అక్కడ ఎద్దుల వెంట పరుగెడితే చాలు. కానీ రంగంపేటలో పరుగెడుతున్న ఎద్దు కొమ్ములు పట్టుకుని లొంగదీసుకోవాలి. పలకలను తమ సొంతం చేసుకోవాలి. అందులో దాచి ఉంచిన బంగారం, వెండి వస్తువులను చేజిక్కించుకోవాలి. అలా చేసినవాళ్లే అసలైన మొనగాళ్లు. అందుకే జల్లికట్టులో రంగంపేటకు ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు మాత్రం జల్లికట్టులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు కోస్తాంధ్రకు కోడిపందేల కోసం క్యూ కట్టినట్లే.. రంగంపేటకు వస్తున్నారు.