Pawan Kalyan : పవన్ స్ట్రాటజీ తో జగన్ కు ఇబ్బందులు తప్పవా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని నియోజకవర్గాల్లో బలోపేతం చేయడం మీద కంటే ఎక్కువగా వ్యూహాలపైనే ఆధారపడుతున్నట్లుంది;

Update: 2025-04-10 08:38 GMT
pawan kalyan, jana sena chief, stratagy, ap politics
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని నియోజకవర్గాల్లో బలోపేతం చేయడం మీద కంటే ఎక్కువగా వ్యూహాలపైనే ఆధారపడుతున్నట్లుంది. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ప్రతి నియోజకవర్గంలో జనసేన ఇన్ ఛార్జులను నియమించకపోవడం వంటివి చేయకపోవడం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు. తక్కువ స్థానాలు తీసుకుని అయినా హండ్రెడ్ పర్సెట్ స్ట్రయిక్ రేటును సాధించడమే లక్ష్యంగా ఆయన పనిచేయాలనుకుంటున్నారు. మరొక వైపు చంద్రబాబు నాయుడుతోనూ, ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సయోధ్యగా ఉంటూనే ముందు అనుభవం సంపాదించుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుంది.

సయోధ్యతతో...
అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబును తన మాటలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. చంద్రబాబు నాయుడు పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెబుతూ టీడీపీ కార్యకర్తలతో పాటు కమ్మ సామాజికవర్గం ఓటర్లకు కూడా పవన్ కల్యాణ్ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ నిరంతరం ప్రజల పక్షాన నిలబడతారన్న పేరును ఇప్పటికే తెచ్చుకున్నారు. ప్రధానంగా గిరిజనుల ఓట్లను ఆయన కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ నేటికీ బలంగా ఉంది. అలాంటి చోట తాను తరుచూ పర్యటిస్తూ ఆ గ్రామాల్లో రహదారులను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎస్టీ నియోజకవర్గాల్లో...
పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాలతో ఎస్టీ నియోజకవర్గాలు కూటమి పార్టీలకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీల్లోనూ ఎస్టీ నియోజకవర్గాల్లో జనసేన ఈసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే పవన్ కల్యాణ్ తరచూ అరకుతో పాటు అనేక ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ గిరిజనులతో మమేకం అవుతున్నారు. ఒక్కసారి వారు పార్టీకి కనెక్ట్ అయ్యారంటే ఇక దూరం కారన్న నమ్మకంతో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు సంపాదిస్తే జగన్ ను ఒక వర్గాన్ని దూరం చేసినట్లే అవుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఎటూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉన్న నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గాల్లోనే ఆయన ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది.
వచ్చే ఎన్నికల్లోనూ...
దీంతో పాటు వచ్చే ఎన్నికల్లోనూ కూటమి కలసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలసి పోటీ చేసి ఈసారి అధిక సీట్లు సంపాదించుకోగలిగితే కేంద్రంలోనూ తాను కీలకంగా మారే అవకాశముందని పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎటూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి మేలు చేయవచ్చన్న ఆలోచనలో జనసేనాని ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాలపైన కూడా త్వరలోనే పవన్ కల్యాణ్ దృష్టి పెట్టే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ తాను ఒంటరిగా పర్యటిస్తూనే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది.





Tags:    

Similar News