ఒకరోజు దీక్షకు సిద్ధం : పవన్
బీసీల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే తాను ఒకరోజు దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళిగిరిలోని పార్టీ కార్యాలయలో బీసీ సదస్సు లో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా బీసీ నేతలు పవన్ ఎదుట డిమాండ్ ఉంచారు. టీడీపీ, బీజేపీలను వదిలేయాలని, ఒంటరిగా పోటీ చేయాలని బీసీ సదస్సులో కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ రెండు పార్టీలను వదిలేసి వస్తే బీసీలు పార్టీకి అండగా ఉంటారంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే పవన్ దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు.
బీసీల సమస్య పరిష్కారానికి...
పవన్ కల్యాణ్ నాలుగు రోజుల పర్యటనకు కొద్దిసేపటిక్రితమే ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బీసీ సదస్సులో పాల్గొన్నారు. ఈ పందర్భంగా పవన్ మాట్లాడుతూ బీసీల సమస్య పరిష్కారానికి తాను ఒకరోజు దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యానికి గురి చేస్తుందన్నారు. మత్స్యకారుల కోసం జనసేన ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వచ్చే పాతికేళ్లలో బీసీల మనుగడకోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.
యువత ముందుకు రావాలి...
బీసీ యువత ముందుకు రావాలన్నారు. కోనసీమలో రెండు వారాలు ఉండి కాపులు, శెట్టిబలిజలకు సయోధ్యను కుదిర్చామని తెలిపారు. కాపులే తనను ఓన్ చేసుకుని ఉంటే తనకు ఓటమి అనేది ఉండేది కాదన్నారు. తనకు వచ్చిన ఓట్లలో ఎక్కువ శాతం బీసీ ఓట్లేనని ఆయన అన్నారు. మత్స్యకారులు తనకు అండగా నిలిచారన్నారు. మత్స్యకారులు, రజకులు, యాదవులు ఎంత ఉన్నతస్థానంలోకి వెళ్లారన్నది ఆలోచించాలన్నారు. 2024 ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తామో పార్టీ ఆవిర్భావ సభలో చెబుతానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఎవరినీ నమ్మవద్దని, జనసేన గెలుపు బీసీలకు గెలుపు అని ఆయన అన్నారు.