విశాఖకు వస్తా: పవన్ కళ్యాణ్

విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన

Update: 2023-12-11 09:26 GMT

pawankalyan vizag

విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే నిరసన తెలిపి ఆ కూడలిని తెరవాలని కోరిన మా నేత నాదెండ్ల మనోహర్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారులు అందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏంటని పవన్ నిలదీశారు. ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తుందని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. నాదెండ్ల మనోహర్ ను, ఇతర నేతలను పోలీసులు తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే నేను విశాఖపట్నం బయల్దేరి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానన్నారు పవన్ కళ్యాణ్.

విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, ఇతర జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్మా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియలెస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని మనోహర్ ఆరోపణలు చేశారు. తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని... శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు.


Tags:    

Similar News