వైసీపీ-జనసేన ఫ్లెక్సీ యుద్ధం
పేదలకి పెత్తందారు. లకి మధ్య జరిగే యుద్ధం' పేరుతో రాష్ట్రంలో వైసీపీ ఏర్పాటు చేస్తున్న పెక్సీల పట్ల జనసేన వర్గాల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ-జనసేన మధ్య ఫ్లెక్సీ యుద్ధం నడుస్తూ ఉంది. ఓ వైపు సోషల్ మీడియాలో వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉండగా.. ఇప్పుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ పార్టీల మధ్య ఫ్లెక్సీల యుద్ధం నడుస్తోంది. వైసీపీ వచ్చే ఎన్నికల్లో సోలోగా పోటీ చేస్తూ ఉండగా.. జనసేన ఎవరి తరపున పోరాడుతుందో తెలియని పరిస్థితి. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఓట్లను చీల్చమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇది వరకే స్పష్టం చేయగా.. తాము ప్రజలకు చేస్తున్న మంచిని ఓర్వలేక కొందరు దుర్మార్గులు చేతులు కలిపారంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులూ మాటలకే పరిమితమైన ఈ గొడవలు కాస్తా.. ఇప్పుడు ఫ్లెక్సీ వార్ కు కారణమయ్యాయి.
'పేదలకి పెత్తందారు. లకి మధ్య జరిగే యుద్ధం' పేరుతో రాష్ట్రంలో వైసీపీ ఏర్పాటు చేస్తున్న పెక్సీల పట్ల జనసేన వర్గాల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు వైసీపీ ఏర్పాటు చేయగా.. ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరుతూ జన సేన నాయకులు ఆందోళన చేపట్టారు.
విశాఖపట్నం సిటీలో వైసీపీ ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాక్షస పాలన అంతం..ప్రజా పాలన ఆరంభమంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వివేకా మొండెం ఉండేలా ఫ్లెక్సీలను తయారీ చేయించారు. జగన్ షర్ట్‌పై 6093 నంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ ఫ్లెక్సీని జనసేన ఏర్పాటు చేసింది. సిరిపురం వీఐపీ రోడ్‌లో పక్కపక్కనే ఇరువర్గాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.