చంద్రబాబు, నారా లోకేష్ లను వెంటాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్
చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావాలని ఓ వర్గం కోరుకుంటూ ఉంది.
చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావాలని ఓ వర్గం కోరుకుంటూ ఉంది. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు కూడా నిర్వహించారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి.
2023 ఆగస్టు 22 మంగళవారం రోజున లోకేష్ గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా ఫ్యూచర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ.. ఎన్టీఆర్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వైరల్ గా మారింది. ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు లాంటి సీనియర్ టీడీపీ నేతల ఫోటోలు లేవు.. కేవలం హరికృష్ణ, ఎన్టీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం రంగన్నగూడెంలోఈ ఫ్లెక్సీలు వెలిశాయి. “యువగళమైన.. జనగళమైన.. నవగళమైన.. ఏ గళమైనా తెలుగు నాట స్మరించే పేరు ఒక్కటే.. నందమూరి తారకరామారావు” అని అందులో పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా “అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే” అంటూ ఒంగోలులో ఏర్పాటు చేసిన ఒక భారీ ఫ్లెక్స్ పై తీవ్ర వివాదం నెలకొంది.
జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలను అప్పగించానే డిమాండ్ ఊపందుకుంటూ ఉంది. పాదయాత్రలోనే ఈ ఫ్లెక్సీలు కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఎన్టీఆర్‌కు అనుకూలంగా కుప్పం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురండి సార్ అంటూ అభిమానులు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడినే అడిగిన వీడియో గతంలో వైరల్ అయింది. విజయవాడలో లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. సిద్ధార్ధ తెలుగు యువత ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కొంతమంది అభిమానులు యువగళం పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేశారు.