Tammineni : మరో వైసీపీ నేత జంప్ కు రెడీ.. సిద్ధం చేసుకుంటున్న లీడర్
ఉత్తరాంధ్రలో కీలకనేత తమ్మినేని సీతారాం వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది
మొన్నటి ఎన్నికలలో ఓటమి పాలయిన వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతుంది. వరసగా నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్రలో కీలకనేత తమ్మినేని సీతారాం కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. స్పీకర్ గా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన తమ్మినేని సీతారాం వైసీపీ నుంచి బయట పడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆయన తన రాజీనామాను ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. తమ్మినేని సీతారాం గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన అనుచరులతో సమావేశమై తమ్మినేని సీతారాం అనంతరం తన నిర్ణయాన్ని బయటకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పార్టీలు మారుతూ...
తమ్మినేని సీతారాం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమయింది. తర్వాత ఆయన 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన అనంతరం తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.అయితే వైసీపీ ఆవిర్భావం తర్వాత తమ్మినేని సీతారాం వైసీపీలో చేరారు. 2014లో ఆముదాల వలస నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో స్పీకర్ గా పనిచేశారు. ఐదేళ్ల పాటు ఆయన ఏపీకి స్పీకర్ గా బాధ్యతలను నిర్వర్తించారు. అయితే తమ్మినేని సీతారాం గత కొంత కాలంగా పార్టీ హైకమాండ్ తీరుతో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ ఛార్జిగా...
ఇందుకు ప్రధానమైన కారణం ఆయనను ఆముదాలవలస ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా జగన్ నియమించారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 1999 నుంచి టీడీపీ నుంచి ఆముదాలవలస లో గెలిచిన తమ్మినేని సీతారాంకు తర్వాత ఎమ్మెల్యే కావాడానికి పదేళ్ల సమయం పట్టింది. వైసీపీ నుంచి మూడు సార్లు టిక్కెట్ పొంది ఒక్కసారి మాత్రమే గెలిచారు. దీంతో తమ్మినేని సీతారాంను పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారన్న సంకేతాలు అందడంతో పాటు, అక్కడ ఆయనకు సరైన జనబలం లేదని గ్రహించారని చెబుతున్నారు. అందుకే సీతారాంను శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారంటున్నారు.
టీడీపీలో నో ఛాన్స్...
మరో ట్విస్ట్ ఏంటంటే తమ్మినేని సీతారాం టీడీపీలో చేరే అవకాశం లేదు. అక్కడ ఆయన ప్రత్యర్థి కూన రవికుమార్ ఉన్నారు. దీంతోపాటు టీడీపీకి అనేకసార్లుగుడ్ బై చెప్పడం, చంద్రబాబుపై విమర్శలు చేయడం, స్పీకర్ గా టీడీపీ నేతలను సభలో నిలువరించడం వంటి కారణాలతో ఆయనకు సైకిల్ పార్టీలో చోటు దక్కే ఛాన్స్ లేదు. అందుకే తమ్మినేని సీతారాం జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఇప్పటికే జనసేన అగ్రనేతలతో తమ్మినేని సీతారాం సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి జంప్ చేయాలన్న యోచనలో తమ్మినేని సీతారాం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇది వైసీపీకి ఉత్తరాంధ్రలో కోలుకోలేని దెబ్బ.