Kurnool : కర్నూలు జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగాలకు కొదవడుందుగా?
కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది.;
కర్నూలు జిల్లాకు సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ అందింది. భారీ ప్రాజెక్టు కర్నూలుకు రానుంది. పది వేల కోట్ల రూపాయల వ్యయంతో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. ఆంధ్ర్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా భారీ ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తుండటం ఒకరకంగా శుభపరిణామమే. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయింది. గూగుల్ సంస్థ కూడా ఏపీకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రామాయపట్నం వద్ద అతిపెద్ద దైన ఆయిల్ రిఫనరీ కంపెనీ కూడా వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మరో భారీ ప్రాజెక్టుకు...
తాజాగా మరో భారీ ప్రాజెక్టు కర్నూలు జిల్లాకు రానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టును రిలయన్స్ సంస్థ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనుంది. అతి పెద్ద సౌర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు రిలయన్స్ ఎస్ యూ సన్ టెక్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకు కర్నూలు జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇప్పటికే రిలయన్స్ సంస్థ ప్రతినిధులు దీనికి సంబంధించిన భూములను పరిశీలన చేసి వెళ్లడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చే అవకాశముందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం కర్నూలు జిల్లాలో రెండు స్థలాలను ఎంపిక చేశారు. వీటిలో ఒకటి రిలయన్స్ సంస్థ ఫైనలైజ్ చేసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.
పది వేల కోట్ల పెట్టుబడితో...
పది వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. 930 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ తో పాటు 465 మెగా వాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించే సమయంలోనే వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. ఇది ప్రత్యక్షంగా లభించే ఉపాధి మాత్రమే. పరోక్షంగా మరో రెండు వేల మంది ఉపాధి పొందే అవకాశముంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉందని, అందుకు సంబంధించిన ఒప్పందంకూడా త్వరలో పూర్తి చేసుకుంటామని అధికారిక వర్గాలు తెలిపాయి. బీఓటీ విధానంలోఈ సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి లభించే విద్యుత్తును వివిధ విద్యుత్తు సంస్థలకు పంపిణీ చేయనున్నారు. సో.. ఇది నిజంగా వరమే కదా? కర్నూలు వాసులూ.. ఆల్ ది బెస్ట్.