TDP : చేరికలతో పార్టీ బలోపేతం అవుతుందా? అందులో నిజమెంత?

టీడీపీలో చేరికలు పార్టీని బలోపేతం చేస్తుందని అధినాయకత్వం భావిస్తుంది. క్యాడర్ మాత్రం నిరుత్సాహపడుతుంది

Update: 2024-12-19 06:08 GMT

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకింత డైలమాలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు ఎవరైనా వస్తారు. చేరేందుకు ఉత్సాహం చూపుతారు. కానీ కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటి వరకూ తమపైన జులుం ప్రదర్శించిన నేతలనే చివరకు తమ జెండా కిందకు తీసుకురావడాన్ని కార్యకర్తలు అస్సలు హర్షించరు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేరికలు అనివార్యమని అధినాయకత్వం భావించినప్పటికీ క్యాడర్ లో అసంతృప్తికి మాత్రం కారణం అయితీరుతుంది. గత ప్రభుత్వంలోనూ అదే జరిగింది. అప్పుడు కూడా టీడీపీ నుంచి అనేక మంది నేతలు పార్టీని వదలి వెళ్లిపోయారు. కానీ వాళ్లంతా తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటం కార్యకర్తలకు మింగుడుపడటం లేదు.

నాయకులు డమ్మీలే...
ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు డమ్మీలు. వారు ఆర్థికంగా కొంత వరకూ ఓట్లను సంపాదించే వీలుంటుంది. అంతే తప్ప క్యాడర్ పోలింగ్ కేంద్రాల్లో అసలు సత్తా చూపించేది క్యాడర్ మాత్రమే. అలాంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే క్యాడర్ లో అసహనం బయలుదేరుతుంది. అది ఏ పార్టీకి అయినా మంచిది కాదు. గత వైసీపీ ప్రభుత్వహయాంలో ఇదే జరిగింది. ఎందరో నేతలను టీడీపీనుంచి చేర్చుకున్నా వారు ఇప్పటికే పార్టీని వదిలేశారు. అధికారం లేకపోతే నాయకులు ఉండరు. ఇప్పుడు టీడీపీలో చేరే నేతలు కూడా రేపు ఒకవేళ అధికారం కోల్పోతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధికార పార్టీలోకి వెళ్లిపోతారు. ఈ సత్యాన్ని అధినాయకత్వం గ్రహిస్తే మంచిదన్న సూచనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
కష్టకాలంలో వదిలేసిన...
ఎమ్మెల్సీలుగా ఉన్న పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్ లను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఏం ప్రయోజనమంటూ క్యాడర్ నుంచి లీడర్ల వరకూ సూటిగా ప్రశ్నించారంటే అది చాలదూ అర్థం చేసుకోవడానికి. ఇక అంతటితో ఆగలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో జెండాను వదిలేసి ఐదేళ్లు అక్కడ ఎంజాయ్ చేసి మళ్లీ ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తే వారిని ఏమనాలి? వారి వెంట పదో ఇరవై మందో కార్యకర్తలు వస్తారు తప్పించి నియోజకవర్గంలో ఓటర్లు మొత్తం గంపగుత్తగా వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. అయినా సరే పార్టీ బలోపేతం అని బూచిచూపెట్టి నేతలను చేర్చుకునే పనికి టీడీపీ నాయకత్వం సిద్ధమవుతుంది.
బలహీనపర్చాలని...
అయితే ఇందుకు ప్రత్యర్థిని బలహీన పర్చాలనుకుంటుంది కానీ, జనంలో సానుభూతి వస్తుందన్న విషయం మాత్రం మరుస్తుంది. తాజాగా ఇప్పుడు ఆళ్లనాని, అవంతి శ్రీనివాస్ వంటి వారు పార్టీలో చేర్చుకోవడానికి కారణాలు చెప్పమంటూ నేతల నుంచి కార్యకర్తలు నిలదీస్తున్నారంటే ఆలోచన చేయాల్సిన అధినాయకత్వం ఏమాత్రం వెనకడుగు వేయనంటుంది. రానున్న కాలంలో వైసీపీ నుంచి అనేక మంది వస్తారు. వచ్చిన వారందరినీ చేర్చుకుంటే గత ఐదేళ్లు జెండాను విడవకుండా మోసిన వాళ్లను ఏం చేయాలన్న ప్రశ్నకు నాయకత్వం వద్ద సమాధానం ఉండదు. అధినాయకత్వం పై నమ్మకంతో చేరుతున్నామని పచ్చిఅబద్ధాలు చెబుతూ చేరిన ఈ నేతలు మళ్లీ అధికారం కోల్పోతే వెంటనే బైబై చెప్పేందుకు సిద్ధమవుతారని గుర్తించకతప్పదు. టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఇదే తరహా కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News