బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్షసూచన

అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో (శనివారం వరకు) కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని..

Update: 2022-09-08 12:43 GMT

కోస్తాంధ్రలో గురువారం ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంలో విపత్తు నిర్వహణశాఖ మరో విషయం తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగళాఖాతం నడుమ అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది.

అల్పపీడన ప్రభావంతో రానున్న 48 గంటల్లో (శనివారం వరకు) కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో పిడుగులు కూడా పడవచ్చని హెచ్చరించింది. వర్షాల సమయంలో రైతులు పొలాల్లో ఉండకపోవడం మంచిదని సూచించింది. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది.

కాగా.. రానున్న 24 గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవచ్చని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది.


Tags:    

Similar News