YSRCP : రజని దెబ్బకు పల్నాడు మటాష్.. జగన్ చేతులారా చేసుకున్నదేనా?

మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి విడుదల రజని;

Update: 2025-03-21 08:28 GMT
marri rajasekhar, lau srkrishana devarayalu, vidadala rajini, ap politics
  • whatsapp icon

మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరుతున్నారు. దీనికి ప్రధాన కారణం మాజీ మంత్రి విడుదల రజని అని వేరే చెప్పాల్సిన పని లేదు. విడదల రజని వల్ల గత ఎన్నికలకు ముందు అప్పటి నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణదేవరాయలు పార్టీని వీడివెళ్లిపోయారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా బాట పట్టారు. ప్రధానంగా విడదల రజనీకి పార్టీలో లభిస్తున్న ప్రాధాన్యం మరే నేతకు పార్టీ నాయకత్వం కల్పించకపోవడమే ముఖ్య నేతలు వీడిపోవడానికి కారణమని చెప్పకతప్పదు. పల్నాడు రాజకీయాలను దగ్గర నుంచి చూసిన వారు ఎవరైనా ఈ విషయాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారు. కానీ జగన్ మాత్రం అందుకు ఒప్పుకునే పరిస్థితి లేదు.

లావు శ్రీ కృష్ణ దేవరాయలు కూడా...
లావు శ్రీ కృష్ణ దేవరాయలు నమ్మకంగా వైసీపీలో ఉన్నారు. 2019 లో వైసీపీ నరసరావుపేట టిక్కెట్ పొంది ఆయన ఎంపీగా గెలిచారు. ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చిన నేతగానే కాకుండా అందరినీ కలుపుకునే వ్యక్తి. యువకుడు కూడా. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అప్పుడు అందరు ఎమ్మెల్యేలను ఆయన కలుపుకుని వెళ్లేవారు. కానీ చిలకలూరిపేట విషయానికి వచ్చేసరికి ఎంపీగా ఉన్న లావు శ్రీ కృష్ణ దేవరాయలను కూడా అప్పట్లో విడదల రజని వర్గం అడ్డుకుంది. అనేక పర్యాయాలు ఆయన అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. జగన్ కోటరీలో ఒక ముఖ్య వ్యక్తి విడదలకు అండగా ఉండటంతో తమకు న్యాయం జరగదని భావించిన లావు శ్రీ కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో లావును నరసరాపుపేట ఎంపీ అభ్యర్థిగా తప్పించి గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం వెనక కూడా విడదల ఉన్నారంటున్నారు.
మళ్లీ ఇన్ ఛార్జిగా నియమించడంతో...
తాజాగా మర్రి రాజశేఖర్ కూడా పార్టీని వీడటానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం జగన్ అని పైకి చెబుతున్నా పరోక్షంగా విడదల రజనీ కారణమని చెప్పకతప్పదు. మర్రి రాజశేఖర్ నాడు కాంగ్రెస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, తర్వాత వైఎస్ జగన్ ను నమ్మకుని చిలకలూరి పేట కేంద్రంగా రాజకీయాలు చేశారు. అయితే బీసీ కార్డు కొట్టి విడదల రజనికి 2019 ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇవ్వడంతో నాటి గాలిలో రజనీ గెలిచారు. అప్పటి నుంచి మర్రి రాజశేఖర్ వర్గాన్ని విడదల రజనీ దూరంగా ఉంచుతున్నారు. ఆయన వర్గానికి కూడా ఎటువంటి పదవులు ఇవ్వకుండా ఐదేళ్ల పాటు ఇబ్బంది పెట్టారంటారు. మంత్రిగా కూడా ఉండటంతో ఆమె హవా ముందు మర్రి ఏమీ చేయలేకపోయారు.
కమ్మ సామాజికవర్గం నేతలు...
లావు శ్రీ కృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్ లు ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నేతలు. ఇద్దరు నేతలు పార్టీని వీడటానికి కారణం కేవలం విడుదల రజనీ మాత్రమే. పోనీ 2024 ఎన్నికల్లో విడదల రజనీని చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ ఇచ్చారు. అక్కడ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లోనూ మర్రి పేరును జగన్ పరిశీలనలోకి తీసుకోలేదు. ఎమ్మెల్సీగా చేశారు కాబట్టి ఆయనను 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత అయినా తనకు చిలకలూరి పేట ఇన్ ఛార్జి ఇస్తారని మర్రి రాజశేఖర్ భావించారు. కానీ ఇన్ ఛార్జిగా తిరిగి విడదల రజనీని నియమించడంతో మర్రి రాజశేఖర్ అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు టీడీపీ నుంచి మొన్నటి ఎన్నకల్లో గెలిచిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు సూచనతో ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంత మంది రజనీ దెబ్బకు పార్టీని వీడతారన్న చర్చ పల్నాడు జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికైనా జగన్ మేల్కొనడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News