Rain Alert : అల్పపీడనం బలహీడన పడినా భారీ వర్షాలు మాత్రం తప్పవట
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని అధికారులు తెలిపారు. అది మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుందని పేర్కొంది. అయితే ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు ఒకింత అలెర్ట్ గా ఉండాలని పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని తెలిపింది. సముద్రం అల్ల కల్లోలంగా ఉండే అవకాశముండటంతో మరో రెండురోజుల పాటు చేపలవేటను నిషేధించడం మేలని అధికారులు భావిస్తున్నారు.
ఈ రెండు జిల్లాల్లో...
ప్రధానంగా అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా ఏపీలో అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నా ఆ రెండు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. సాధారణ జీవితంలో ఒడిదుడకులు ఎదుర్కొంటున్నారు. చిరు వ్యాపారులు వ్యాపారం లేక, ఉపాధి కరువై కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతులు కూడా వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, పొగాకు, వరి పంటలు తడిసిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అంచనాలు వినపడుతున్నాయి.
ఈదురుగాలులు వీచే...
అల్పపీడనం బలహీనపడినా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతంలో గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని చెబుతున్నారు. అదే సమయంలో తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నందున అప్రమత్తంగా ప్రజలు ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైతులు కూడా తమ పంట ఉత్పత్తులను ముందుగానే కాపాడుకోవాలని చెబుతున్నారు. ఈ ప్రభావంతో చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, సాధరణ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now