Weather Report : నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు...ఏపీకి వాతావరణ శాఖ అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-12-23 03:43 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా తీరాలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో నేటి నుంచి ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారడంతో కొంత ముప్ప తప్పినట్లేనని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయినా తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండటంతో వర్షాలు కురియడం ఆగవని మాత్రం అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు...
మరోవైపు తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో ప్రజలు అలెర్ట్ గా ఉండాలని కోరింది. ప్రధానంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు దాటే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీంతో పాటు రైతులు కూడా తమ పంట ఉత్పత్తులను భద్రపర్చుకోవాలని, ఇప్పటికే ధాన్యం తడిసి ఇబ్బందులు పాలవుతున్న రైతాంగానికి మరోసారి వర్ష సూచనతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం తడిసిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేస్తామని చెబుతుంది. ఆందోళన చెందవద్దని సూచిస్తుంది.
ఉపాధి లేక కొన్ని రోజుల నుంచి...
ఈ నాలుగు జిల్లాలైన బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు మూడో నెంబరు హెచ్చరికలను జారీ చేసింది. మత్స్యకారులు ఎవరూ చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. ఈ నెల 26వ తేదీ వరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా సముద్రంలో చేపల వేటను నిషేధించడంతో మత్స్యకారులు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపాధి లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News