Rain Alert : ఏపీకి మూడు రోజులు వర్షాలు.. వాయుగుండంగా మారడంతో?
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అయితే దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతవరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని కూడా అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల చిరుజల్లులు ప్రారంభమయినట్లు తెలిసింది. ప్రధానంగా కోస్తా ప్రాంతంలో చిరుజల్లులు పడుతుండటంతో వాయుగుండం ప్రభావం చూపతుందని భావిస్తున్నారు. చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా తీర ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.
ఉపాధి లేక...
ఆంధ్రప్రదేశ్ లో తరచూ అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు వర్షాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాల వల్ల చికాకు ఏర్పడుతుంది. జనజీవనానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. జోరున వర్షాలవల్ల ఉపాధి కోల్పోతున్నామని చిరు వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో మత్స్యకారులు కూడా గత పదిహేను రోజులుగా సముద్రం ఒడ్డుకే పరిమితమయ్యారు. చేపల వేటపై నిషేధం విధించడంతో వారికి కూడా ఉపాధి కష్టంగా మారింది. గురువారం వరకూ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే కోస్తా ప్రాంతంలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెబుతున్నారు.
మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక...
కోస్తా తీర ప్రాంతాలై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. రాయలసీమ జిల్లాలోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గంటలకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా అధికారులు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అనేక పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశాయి. వాయుగుండం తీరం దాటేంత వరకూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు.