Weather Report : ఏపీలో మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు తప్పవట

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రెండు రోజులు వర్షాలు పడతాయని తెలిపింది

Update: 2024-12-07 04:03 GMT

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం మీదుగా ఈ నెల 12వ తేదీ నాటికి శ్రీలంక - తమిళనాడు వద్ద తీరాలకు చేరుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. రాబోయే రెండు రోజుల పాటు ఏపీ, తమిళనాడుల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నిన్న మొన్నటి వరకూ...
నిన్న మొన్నటి వరకూ ఫెంగల్ తుపాను దెబ్బకు భారీ వర్షాలతో రైతులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలో భారీగా పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఫెంగల్ తుపాను దెబ్బకు తమిళనాడులో పద్దెనిమిది మంది మరణించారు. దీంతో వర్షం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో తుపానులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ వరస అల్పపీడనాలతో వర్షాలు కురియడంతో ప్రజలు విసుగు చెందుతున్నారు.
ఈ ప్రాంతాల్లో వర్షాలు...
ఈరోజు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోవని తెలిపింది. అయితే రైతులు తమ పంట ఉత్పత్తులను జాగ్రత్తగా దాచుకునేందుకు ముందస్తు ప్రయత్నాలు చేయాలని కోరింది. వర్షానికి ధాన్యం తడవకుండా తగిన చర్యలు ముందుగానే తీసుకుంటే మంచిదని సూచించింది. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడతాయని, రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News