Rain Alert : ఏపీకి వర్ష సూచన.. వాతావరణ శాఖ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే?
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమని అధికారులు చెబుతున్నారు. అయితే బుధవారం నాటికి ఇది శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో డిసెంబర్ 15వ తేదీ వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు...
ప్రధానంగా ఈ అల్పపీడనం ప్రభావంతో కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 11,12 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ఈదురుగాలులు కూడా బలంగానే వీచే అవకాశముందని తెలిపింది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురియడం వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
రైతులకు సూచన...
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కోతకి సిద్ధంగా ఉన్న వరి పంటను వర్షాలకు ముందు కోయరాదని తెలిపింది. కోసినా పూర్తిగా ఆరని వాటిని కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేస్తే నష్ట శాతం నివారించవచ్చని సూచించింది. వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. మొత్తం మీద మరోసారి వర్ష సూచనతో ప్రధానంగా ఏపీలోని రైతులు మాత్రం తమ పంట ఉత్పత్తులను జాగ్రత్తపర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది.