Sankranti Festival : సంక్రాంతికి సొంతూరు వెళ్లాలనుకుంటున్నారా? ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందేనా?

సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లాలని ఎక్కువ మంది కోరుకుంటారు. కానీ రైళ్లలో టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి

Update: 2024-09-16 07:16 GMT

సంక్రాంతి పండగకు సొంత గ్రామాలకు వెళ్లాలని ఎక్కువ మంది కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద పండగ సంక్రాంతి కావడంతో ఆ సమయంలో ఊళ్లకు వెళ్లాలని ఉత్సాహపడుతుంటారు. ఈసారి వరస సెలవులు సంక్రాంతి పండగకు వచ్చాయి. దీంతో రైళ్ల టిక్కెట్లన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. రిజర్వేషన్లు లేవు. బెర్త్‌లు మొత్తం అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ప్రతి రైలులోనూ రిజర్వేషన్ టిక్కెట్లు అయిపోవడంతో ఇక వెయిటింగ్ లిస్ట్ మాత్రమే చాంతాడంత మిగిలింది. సంక్రాంతికి నాలుగు నెలలు ముందుగానే ఓపెన్ చేసిన వెంటనే టిక్కెట్లన్నీ బుక్ కావడంతో రైల్వే అధికారులు సయితం ఆశ్యర్యపోతున్నారు.

ముందుగానే టిక్కెట్లు...
హైదరాబాద్ నుంచి బయలుదేరే అన్ని రైళ్లలోని టిక్కెట్లు వెంటనే కొనుగోలు చేశారు. సింహపురి, కోణార్క్, గౌతమి, శబరి, గోదావరి, ఫలక్‌నుమా, గరీబ్‌రధ్, ఈస్ట్‌కోస్ట్, చార్మినార్, వందేభారత్ రైలుతో సహా అన్ని రైళ్లలో సీట్లు భర్తీ అయిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 11 నుంచే టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. 11వ తేదీ శనివారం కావడం, 12 ఆదివారం రావడంతో ఆ తర్వాత పండగ మూడు రోజులు సొంతూళ్లలో గడపొచ్చని ముందుగానే బుక్ చేసుకున్నారంటే నిజంగానే ఇది ఆశ్యర్యకరమైన విషయమంటున్నారు. రైల్వే శాఖ అధికారులు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి అేదని అంటున్నారు.
స్పెషల్ ట్రెయిన్స్ ను ....
మరోవైపు దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకరైళ్లను ఏటా వేస్తుంది. వాటిని ముందుగానే వేస్తే తాము అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటామని చెబుతున్నారు. అయితే రైల్వే అధికారులు ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే అవకాశముంది. అయితే స్పెషల్ ట్రెయిన్స్ ఎప్పుడు అన్న క్లారిటీ రాకపోవడంతో ముందుగానే ఆర్టీసీ, ప్రయివేటు బస్సులను కొందరు ఆశ్రయిస్తున్నారు. ప్రయివేటు బస్సులు కూడా సంక్రాంతి పండగకు వెళ్లేందుకు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
కార్ పూలింగ్ కూడా...
అందుకే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముందుగానే స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసి ప్రజలను ఆర్థిక భారం నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నారు. మరికొందరు కార్ పూలింగ్ కు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాలకు వెళ్లే వారు 11వ తేదీన తమ కారులో బయలుదేరవచ్చన్న పోస్టింగ్ లు నెట్టింట కనపడుతున్నాయి. దీంతో ఈ సారి సంక్రాంతి రద్దీ మామూలుగా ఉండదని నాలుగు నెలల ముందుగానే తేలిపోయింది.మొత్తం మీద ఈసారి సంక్రాంతి ప్రయాణ కష్టాలు ప్రజలకు తప్పేట్లు లేవు.


Tags:    

Similar News