Nallari : నల్లారి మళ్లీ కనిపించడం లేదే...దారి మార్చుకోలేకపోతున్నారా?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Update: 2024-07-17 11:49 GMT

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆయన 2014 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. తాను సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఆ పార్టీని క్లోజ్ చేసేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కనీసం ఆ పార్టీ తరుపున అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని కూడా నిర్వహించలేదు. దీంతో ఆయన సూదూర ఆలోచన చేసి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాదని భావించి చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చివరకు ఆయన పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్ ను కూడా సంపాదించుకున్నారు.

ఓటమి తర్వాత...
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. రాష్ట్రమంతటా కూటమి అభ్యర్థులు ఇరవై ఒక్కస్థానాలలో గెలిస్తే నాలుగు స్థానాల్లో మాత్రమే ఓటమి పాలయింది. కడప, తిరుపతి, అరకుతో పాటు రాజంపేట పార్లమెంటు స్థానం. రాజంపేటలో తాను గెలిస్తే కనీసం ఢిల్లీ స్థాయిలో ఐదేళ్లు సేదతీరాలనుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని లెక్కలేసుకున్నారు. కానీ ఊహించని ఓటమితో ఆయన డల్ అయ్యారు. తాను ఊహించుకున్న కలలన్నీ పేకమేడల్లా కూలికపోవడంతో తిరిగి పదేళ్లు వెనక్కు వెళ్లిపోయారు.
హైదరాబాద్ కే పరిమితమయి...
రాజంపేటలో తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి కుటుంబం చేతిలోనే ఆయన ఓటమి పాలు కావడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే ఆయన తిరిగి హైదరాబాద్ కు పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలోనూ తాను ప్రాతినిధ్యం వహించిన పార్టీ కూడా పవర్ లోనే ఉంది. ఆయన నియోజకవర్గం ప్రజలకు దగ్గరయి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సిన సమయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం మళ్లీ మొదటి కొచ్చిందన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. బీజేపీలో పార్టీకి ఉపయోగపడే వారికే ప్రాధాన్యత ఉంటుంది. అంతేకానీ పిలిచి బొట్టుపెట్టి మరీ పెద్దపీట వేస్తారని భావించడం కమలం పార్టీలో అత్యాశ కిందే మారుతుంది.
తమ పరిస్థితి ఏంటి?
ఎందుకంటే.. గత ఎన్నికల్లో ఇచ్చిన సీట్లు కానీ, కేంద్రంలో, రాష్ట్రంలో ఇచ్చిన మంత్రి పదవులను బట్టి చూస్తే విధేయత, విశ్వసనీయత ఉన్నవారికే పదవులు దక్కుతాయి. కానీ ఎందుకో మళ్లీ నల్లారిలో ఈ నిరాశ ఎందుకు మొదలయిందని ఆయన సన్నిహిత వర్గాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. ఆయన యాక్టివ్ గా ఉంటే తమకు కూడా లోకల్ గా ఏదో నామినేటెడ్ పదవులు వస్తాయని, ఆయనే పార్టీకి దూరంగా ఉండి పట్టీపట్టనట్లు ఉంటే తమ పరిస్థితి ఏంటన్న ప్రశ్న నల్లారి అనుచరుల్లో మొదయింది. ఓడిపోయామని హైదరాబాద్ కు వెళ్లినంత మాత్రాన రాజకీయ అవసరాలు ఎలా తీరతాయని కొందరు అనుచరులు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం కమలంపార్టీలోనే కాదు.. ఆయన అనుచరుల్లోనూ హాట్ డిస్కషన్ గా మారింది.


Tags:    

Similar News