50 రోజులుగా ఏమి చేస్తున్నారు: నారా లోకేష్
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని.. చంద్రబాబుపై కేసులకు;
వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని.. చంద్రబాబుపై కేసులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏం చేస్తున్నారని నారా లోకేశ్ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే చెల్లిందని ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైసీపీ నేతలు చెబుతున్నారని.. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును నారా భువనేశ్వరి, లోకేశ్, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. స్కాంలతో తమకు కానీ తమ పార్టీ నేతలకు కానీ బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ప్రజల నుంచి ఆయనను దూరం చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాడకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని.. అంతే తప్ప చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని లోకేశ్ తెలిపారు. టీడీపీ అధినేతను జైలులోకి పంపడంపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో పెడితే బాగుండేదని అన్నారు.