ఏపీలో మారిన వాతావరణం.. ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు
నైరుతి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ..
ఏపీ వాసులకు మండుటెండల నుండి ఇప్పుడిప్పుడే ఉపశమనం లభిస్తోంది. రాయలసీమ నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నైరుతి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు మన్యం, అనకాపల్లి, అల్లూరి , కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
అలాగే విజయనగరం,విశాఖ, తిరుపతి,చిత్తూరు, అన్నమయ్య, YSR కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు మరింత పెరుగుతాయని అంచనా వేసింది వాతావరణ విభాగం. ప్రస్తుతం అక్కడక్కడా పడుతున్న వర్షాలతో.. అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు విముక్తి లభించింది.