నెలరోజుల్లో ఇళ్లు.. కంటితుడుపు చర్య కాకూడదు : పవన్ కల్యాణ్
అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం, డ్యామ్ కోసం స్థలాలు తీసుకున్న బాధితులకు ప్రభుత్వం సహాయం అందించకపోవడంపై..
అన్నమయ్య డ్యామ్ బాధితులకు నెలరోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏ మేరకు నెరవేరుస్తుందో చూసేందుకు నెలరోజులు వెయిట్ చేస్తామని, ఇది కంటితుడుపు చర్య కాకూడదని ఆశిస్తున్నామంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
‘‘అన్నమయ్య డ్యామ్ బాధితుల విషయంలో వైసీపీ ప్రభుత్వ స్పందన.. మోకాలడ్డేలా, కంటి తుడుపు చర్యలా ఉండబోదని ఆశిస్తున్నా. మీరిచ్చిన హామీని ఎంత వరకు నిబద్ధతతో నెరవేర్చారో చూసేందుకు మరో నెల రోజులు జనసేన ఎదురుచూస్తుంది’’ అని పవన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కథనాన్ని షేర్ చేశారు.
అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం, డ్యామ్ కోసం స్థలాలు తీసుకున్న బాధితులకు ప్రభుత్వం సహాయం అందించకపోవడంపై పవన్ గతంలోనూ ట్విట్టట్ వేదికగా విమర్శలు గుప్పించారు. అన్నమయ్య డ్యామ్ ను పూర్తిచేస్తి.. ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలను రక్షిస్తామని చెప్పిన ప్రభుత్వం.. దుర్ఘటన జరిగి 18 నెలలు గడిచినా ఇంతవరకూ వీసమెత్తు పనులు చేయలేదని విమర్శించారు. అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పారని పవన్ అసహనం వ్యక్తం చేశారు.