జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ఉత్తరాంధ్ర దోపిడీ ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం ఈ ఎర్రమట్టి దిబ్బలు అని, దాదాపు 20వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన ప్రాంతమని అన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. టూరిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని, తాను ఈ విషయాన్ని కేంద్రపర్యావరణ శాఖ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. 32 భారత వారసత్వ ప్రదేశాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఒకటిగా ఉందని అన్నారు. 1200 ఎకరాల్లో ఉండే ఈ మట్టి దిబ్బలు ఈరోజు కేవలం 292 ఎకరాలు మాత్రమే మిగిలాయని, తెలిసో, తెలియకో కొంత ప్రాంతం రక్షణ శాఖకు ఇచ్చారని, మిగిలిన ప్రాంతాన్ని కూడా దోచేస్తున్నారని ఆరోపించారు. మిగిలిన 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల చుట్టూ కనీసం 30 ఎకరాల రక్షణ భూమి ఉండాలని, కానీ కనీసం 100 అడుగుల భూమి కూడా లేదన్నారు. చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నానని, రక్షణ చర్యలు తీసుకుంటారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.