ప్రస్తుతానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిలాక్స్
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో, పిన్నెల్లి స్పందించారు. న్యాయం గెలిచింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. ఈ సంఘటన మే 13న జరిగితే.. మే 15న ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారని అన్నారు. ముందు ఎఫ్‌ఐఆర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని తెలిపారు. నారా లోకేష్ ట్విట్టర్‌లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని కూడా అన్నారు.