పురిటిగడ్డలో బయల్పడిన క్రీ.శ. 3వ శతాబ్ది ప్రాకృత శాసనం

కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, పురిటిగడ్డలో క్రీ.శ.3వ శతాబ్ది కి చెందిన బ్రహ్మీ శాసనం బయల్పడిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.

Update: 2024-03-16 11:04 GMT

 కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం, పురిటిగడ్డలో క్రీ.శ.3వ శతాబ్ది కి చెందిన బ్రహ్మీ శాసనం బయల్పడిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా.ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. పురిటిగడ్డలోని పోతురాజు దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా, విగ్రహాన్ని ఊడదీసి భద్రపరిచిన సందర్భంగా, విగ్రహం ఒక పక్కన అక్షరాలు ఉన్నాయని అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీఓ నాదెళ్ల శివరామకృష్ణ, పీజీటీ డా.ఉమా సరస్వతి, తనకు సమాచారం అందించగా, ఆ శాసనాన్ని కేంద్ర పురావస్తు శాఖ, శాసన విభాగ సంచాలకులు డా. కె. మునిరత్నంరెడ్డికి పంపానని చెప్పారు.

శాసనాన్ని పరిశీలించి, అది క్రీ.శ. 3వ శతాబ్ది (ఇక్ష్వాకుల )నాటి ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో ఉందని, ఆనందుడనే ఒక బౌద్ధాచార్యుడు, ఆ శిలాఫలకాన్ని ప్రతిష్టించిన విషయం ఉందని, శాసన ఫలకం పగిలి కొన్ని అక్షరాలు పోయినందున పూర్తి వివరాలు తెలియటం లేదని మునిరత్నంరెడ్డి చెప్పారన్నారు.

ఈ పల్నాటి సున్నపురాతి ఫలకంపై, ఎదురుగా పోతురాజు విగ్రహం, ఒకపక్క పై శాసనం, మరోపక్క ఇద్దరు బిడ్డలతో ఉన్న తల్లి విగ్రహం ఉన్నాయని, ఇవి క్రీ.శ. 18వ శతాబ్దం నాటివని శివనాగిరెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ శాసన ప్రతిబింబాన్ని పోతురాజు దేవాలయం వద్ద ప్రదర్శించి, భావితరాలకు తెలియజేయాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News