లిఖితపూర్వకంగా పిలిస్తేనే చర్చలకు వెళతాం

తమపై ఎప్పుడుపడితే అప్పుడు చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పీఆర్సీ సాధన సమితి నేతలు చెప్పారు.

Update: 2022-01-31 13:01 GMT

తమపై ఎప్పుడుపడితే అప్పుడు చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పీఆర్సీ సాధన సమితి నేతలు చెప్పారు. ఆర్థిక శాఖ అధికారులు ఈ విషయాన్ని గుర్తెరగాలన్నారు. పీఆర్సీ సాధన సమావేశం ముగిసిన తర్వాత నేతలు మీడియాతో మాట్లాడారు. ఆర్థిక శాఖ అధికారులు తమ ఉద్యోగులపై వత్తిడి తెస్తున్నారని, ఐఏఎస్ అధికారులపై అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరని, తాము న్యాయబద్ధంగానే పోరాడుతున్నామని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమని వారు చెప్పారు. ప్రభుత్వం చర్చల విషయంలో తప్పుదోవ పట్టిస్తుందన్నారు. మంత్రుల కమిటీ ఒకే ఒకసారి చర్చలకు ఆహ్వానం పలికారని, అంతకు మించి తమకు ఆహ్వానం రాలేదన్నారు. వారి ఆహ్వానం మన్నించి తమ ప్రతినిధులను చర్చలకు పంపామని, వారి పట్ల మంత్రుల కమిటీ అమర్యాదకరంగా ప్రవర్తించిందన్నారు. తమను ఎవరూ చర్చలకు పిలవలేదన్నారు. మీడియలో చెప్పడమే తప్ప తమను చర్చలకు ఆహ్వానించలేదన్నారు. లిఖితపూర్వకంగా పిలిస్తేనే చర్చలకు వెళతామని నిర్ణయించామన్నారు.

చర్యలు అంత సులువు కాదు....
ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తుందన్నారు. ఇది ఆటవిక రాజ్యం కాదని, ప్రజాస్వామ్యమని వారు చెప్పారు. ఏ ఉద్యోగి ప్రభుత్వ బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదన్నారు. అవసరమైతే ఒక లీగల్ సెల్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూల్ 22 ఎ ఆఫ్ సీసీఏ రూల్స్ ను అనుసరించే చర్యలు తీసుకోవాలని, అందుకు భిన్నంగా చర్యలు తీసుకోలేరని వారు తెలిపారు. సర్వీస్ రిజిస్టర్ లు చూడకుండా పే ఫిక్సేషన్ ను ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. మంత్రుల కమిటీ తమపై దుర్మార్గమైన ఆరోపణలు చేస్తుందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం జీతాలను చెల్లిస్తే పే స్లిప్పులను దహనం చేయాలని నేతలను పిలుపు నిచ్చారు.


Tags:    

Similar News