Andhra Pradesh : జోగి తర్వాత ఎవరు... అరెస్ట్ కు రెడీగా ఉండాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్‌ల ప్రక్రియ ప్రారంభమయింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరూ అరెస్ట్ అయ్యేందుకు ఇక రెడీగా ఉండాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్‌ల ప్రక్రియ ప్రారంభమయింది. వైసీపీ నేతలు ఒక్కొక్కరూ అరెస్ట్ అయ్యేందుకు ఇక రెడీగా ఉండాల్సిందే. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను బయటకు తీసి ప్రస్తుత ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వంలో తమ పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిందని నాడు టీడీపీ నేతలు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత అరెస్ట్‌లను ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించింది. చంద్రబాబు ఇంటిపైకి దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడు. చంద్రబాబు ఇంటి మీద దాడి ఘటన తర్వాతనే జోగి రమేష్ కు మంత్రి పదవి లభించందంటారు.
జోగి కుటుంబాన్ని...
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. జోగి రాజీవ్ తో పాటు జోగి రమేష్ బాబాయిని కూడా ఈ కేసుల్లో నిందితులుగా పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలతో జోగి రాజీవ్ ను ఏసీీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ జోగి రమేష్ కు తాడేపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఈరోజు సాయంత్రం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అంటే.. ఫస్ట్ జోగి రమేష్ కుటుంబం అధికార పార్టీకి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో చిక్కడంతో ఇక అస్సలు వదలలేదు.
నెక్ట్స్ ఎవరు?
ఇప్పుడు వైసీపీ నేతల్లో చర్చ మొదలయింది. జోగి రమేష్ కుటుంబం తర్వాత నెక్ట్స్ ఎవరు అన్నది ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతుంది. కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వ హాయంలో అనేక మంది నేతలు అప్పటి ప్రతిపక్ష టీడీపీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు. కానీ కృష్ణా జిల్లాలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావులు ఉన్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. వీరిపై ఇప్పటికే కొన్ని కేసులు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేస్తారని అంటున్నారు.
వీరిపై ఆగ్రహంతో...
కొడాలి నాని పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తమ అధినేతను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు ఆయనను కించపర్చేలా మాట్లాడటంతో నానిని అరెస్ట్ చేయాలని ఎక్కువ మంది తమ్ముళ్లు కోరుకుంటున్నారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా అదే స్థాయిలో చంద్రబాబు, పవన్ ను విమర్శించడంతో ఆయనపై కూడా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిలో ఒకరు త్వరలోనే అరెస్ట్ అవుతారని అంటున్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపర్చకుండా డైవర్ట్ చేయడానికే తమపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైనా కర్మ రిటర్న్ అన్నది కృష్ణా జిల్లా వైసీపీ నేతల్లో నిజమవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.