పిడుగులు-వర్షాలు.. ఈ జిల్లాలకు హై అలర్ట్
పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కురిసిన అకాల వర్షంతో రైతులు నష్టపోయారు. అత్యధిక మండలాల్లో ఒక మోస్తరు
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఒక్కసారిగా కోనసీమ జిల్లాలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసాయి. అలాగే కొన్ని చోట్ల ఈదురుగాలులు, పిడుగులు పడ్డాయి. బుధవారం అల్లూరి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అనకాపల్లి, కృష్ణ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కురిసిన అకాల వర్షంతో రైతులు నష్టపోయారు. అత్యధిక మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. భీమవరం, ఆచంట, ఆకివీడు, కాళ్ల, ఉండి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో వర్షం కురిసింది. ఆచంట మండలంలో ఇప్పటికీ అనేకచోట్ల ధాన్యం రాశులు, బస్తాలు రోడ్లపైనే ఉన్నాయి. అవి తడిచి ముద్దయ్యాయి. ఆకివీడులో రెండున్నర గంటలపాటు ఏకధాటిగా వర్షం పడింది. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.