Tirumala : ఆపదమొక్కుల వాడా.. ఏదీ నీ జాడ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత పదిహేను రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2024-06-18 03:04 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత పదిహేను రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. వేసవి సెలవులు ముగిసినా తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. గతంలో ఎన్నడూ జూన్ రెండో మూడో వారంలో ఇలాంటి పరిస్థితి లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. గంటల తరబడి భక్తులు వసతి గృహాల కోసం నిరీక్షిస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.

దర్శనానికి 30 గంటలు...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు బయట వరకూ నిల్చుకున్నారు. క్యూ లైన్ శిలా తోరణం వరకూ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు టీటీడీ ఉచితంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,872 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,236 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News