Tirumala : మంగళవారం తిరుమలలో ఇంత రద్దీ ఏంది గోవిందా?
తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా భక్తులు అధికసంఖ్యలో ఉంది.;

తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా భక్తులు అధికసంఖ్యలో ఉంది. భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. ఎక్కడ చూసినా భక్తుల సందోహమే. మాడ వీధుల నుంచి క్యూ లైన్ ల వరకూ భక్తులు నిండిపోయి కనిపిస్తున్నారు. పరీక్షల ఫలితాలు వెల్లడి కావడంతో ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు.
వివిధ దర్శనాలకు...
తిరుమలలో ముందుగా బుక్ చేసుకున్న ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలతో వచ్చిన వారు, ఎస్.ఎస్.డి టోకెన్లు తీసుకుని తిరుమలకు వచ్చిన వారితో పాటుగా కాలినడకన వచ్చే భక్తులే కాకుండా ఎలాంటి టోకెన్లు లేకుండా ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులతో రోజుకు డెబ్భయి నుంచి ఎనభై వేల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వీరందరికీ వసతి గృహాలను కల్పించడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కష్టంగా మారింది.
బయట వరకూ క్యూ లైన్...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట టీబీసీ వరకూ క్యూ లైన్ భక్తులతో విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,078 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,831 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.