BJP : వీర్రాజు ఎంట్రీతో ఈయనకూ పదవి రెడీ అయిపోయిందటగా
బీజేపీలోని సీనియర్ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్నారు. ఒక్కొకరు పదవులు పొందే అవకాశాలున్నాయి;

భారతీయ జనతా పార్టీలోని సీనియర్ నేత సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నికవుతున్నారు. మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే సోము వీర్రాజు సరే.. మరో కీలక నేత జీవీఎల్ నరసింహారావు మాటేంటి? అన్న చర్చ పార్టీలో నడుస్తుంది. వీర్రాజు మాదిరిగానే త్వరలోనే జీవీఎల్ కు కూడా పదవి దక్కుతుందన్న అంచనాలు పార్టీలో ఊపందుకున్నాయి. సోము వీర్రాజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాసనమండలిలో కాలు మోపినట్లుగానే జీవీఎల్ నరసింహారావును కూడా కీలకపదవి వరించడానికి సిద్ధంగా ఉందన్న ప్రచారం ఊపందుకుంది. నిజానికి బీజేపీలో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహరావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు యాంటీ టీడీపీగా ముద్రపడ్డారు.
చంద్రబాబు అభ్యంతరం తెలుపుతారని...
వీరికి పదవులు కూటమి ప్రభుత్వంలో లభించవని అందరూ భావించారు. ఒకవేళ బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రతిపాదించినా అందుకు చంద్రబాబు అంగీకరించరని తెలుగు తమ్ముళ్లతో పాటు బీజేపీలోని మరొక వర్గం కూడా గట్టిగా విశ్వసించింది. ఎందుకంటే ప్రో జగన్ గా ముద్రపడిన ఈ నేతలకు పదవుల విషయంలో చంద్రబాబు మోదీ, అమిత్ షా ల వద్ద అభ్యంతరం చెబుతారని అంచనా వేసింది. అయితే చంద్రబాబును ఒప్పించి కేంద్ర నాయకత్వం నేరుగా సోము వీర్రాజును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడానికి సిద్ధమయింది. అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ బ్యాచ్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రంతో నిధుల అవసరం కూడా ఉండటంతో చంద్రబాబు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
రానున్న ఖాళీల్లో...
ఇక సోము వీర్రాజుకు పదవి వచ్చింది కాబట్టి తర్వాత నేత జీవీఎల్ నరసింహారావు అని అంటున్నారు. తొలి నుంచి పార్టీలో ఉంటూ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మిత్రపక్షంలో ఉన్నప్పటికీ తమ మాట చెల్లుబాటు అయ్యేలా ఢిల్లీ నుంచి అధినాయకత్వం పావులు కదుపుతున్నట్లే కనపడుతుంది. రానున్న కాలంలో ఖాళీ అయ్యే ప్రతి ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవుల్లో బీజేపీ తన భాగాన్ని కోరుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. రానున్న కాలంలో ఖాళీ అయ్యే పదవుల్లో జీవీఎల్ నరసింహారావుకు కూడా పదవి లభించడం ఖాయమని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి పురంద్రీశ్వరిని తప్పించి ఆమె స్థానంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ను ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో అధినాయకత్వం ఉందని తెలిసింది.