Dharmana : ధర్మాన కనిపించకపోవడానికి అసలు కారణమదేనా?
శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు;

శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు. ఓటమి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నారు. ధర్మాన ప్రసాదరావు ఈసారి తనను పోటీ చేయవద్దని, తన కుమారుడికి అవకాశమివ్వాలని, తాను రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన జగన్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పోటీ చేయాల్సిందే అంటూ బలవంతంగా రంగంలోకి దించారు. అయితే ధర్మాన ప్రసాదరావు ఓటమితో ఆయన మరింత డీలా పడినట్లు చెబుతన్నారు. వాగ్దాటి ఉన్న నేతగా సిక్కోలు ప్రాంతంలో చురుకైన నాయకుడిగా ఎదిగిన ధర్మాన ప్రసాదరావు వైసీపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు.
జగన్ ను కలిసినా...
ఇటీవల శ్రీకాకుళం వచ్చిన జగన్ ను మాత్రం మర్యాదపూర్వకంగా కలిసిన ధర్మాన ప్రసాదరావు తర్వాత యధాతథంగా ఇంటికే పరిమితమయ్యారు. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పటికి మూడుసార్లు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. మంచి వాగ్దాటి ఉంది. సబ్జెక్ట్ పై కమాండ్ ఉంది. 2019 ఎన్నికలో గెలిచిన తర్వాత ధర్మాన ప్రసాదరావును రెండో విడత మంత్రివర్గంలోకి జగన్ తీసుకున్నారు. ధర్మాన ప్రసాదరావుకు కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. రెవెన్యూ శాఖలో ఇప్పుడు అనేక ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
బడ్జెట్ పై కూడా...
ఈకారణం వల్లనే ధర్మాన ప్రసాదరావు సైలెంట్ అయ్యారంటున్నారు. కేసులలో తనను ఇరికిస్తారేమోనన్న ఆందోళనలో ఆయన ఉన్నట్లు కనిపిస్తుందంటున్నారు. అందుకే బడ్జెట్ పై అవగాహన ఉన్న ధర్మాన ప్రసాదరావు దానిపైన కూడా మాట్లాడకపోవడం ఇదే కారణమని చెబుతున్నారు. వివిధ అంశాలపై అనర్గళంగా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు మౌనంగా ఉండటానికి ఒకటి కేసుల భయం కాగా మరొకటి తన కుమారుడికి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అప్పగించాలని వైఎస్ జగన్ ను కోరినట్లు తెలిసింది. తాను ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటానని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే జగన్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందన తెలియజేయలేదంటున్నారు. మొత్తం మీద ధర్మాన ఇక రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన ఇక రాజకీయాల్లో కి రాకపోవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.