సింహాచలం గిరిప్రదక్షిణ.. అప్పన్న ఆలయం చుట్టూ భక్తజన సందోహం
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు గిరి ప్రదక్షిణను కొనసాగించారు. సోమవారం ఉదయానికి సింహాచలం పరిసర ప్రాంతాలు..
సింహాచలంలో భక్తుల గిరిప్రదక్షిణ రెండోరోజు కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం నుండే ప్రారంభమైన గిరిప్రదక్షిణ సోమవారం ఉదయం కూడా కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు విశాఖ నగర పోలీసు కమిషనర్ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అడవివరం, హనుమంతవాకా, అప్పుఘర్ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.32 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ జరుగుతుంది. ప్రతిఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో సింహాచలంలో గిరిప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు గిరి ప్రదక్షిణను కొనసాగించారు. సోమవారం ఉదయానికి సింహాచలం పరిసర ప్రాంతాలు భక్తజన సందోహాన్ని తలపించాయి. గోవింద నామస్మరణతో సింహాచల రహదారులు మారుమ్రోగుతున్నాయి. ఉదయం 7 గంటల సమయంలో పాతగోశాల టీ జంక్షన్ వద్ద రద్దీ జనసంద్రాన్ని తలపించింది. కనుచూపుమేరలో ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు కనిపించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా.. తెలుగు రాష్ట్రాలు, ఒడిశా నుంచి కూడా భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చారు. గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులకు జీవీఎంసీతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్నాయి.