Pithapuram : పిఠాపురంలో ఏం జరుగుతుంది.. మాకు తెలియాలి..మాకు తెలియాలి

పిఠాపురంలో జరగకూడనిది ఏదో జరుగుతుంది. కూటమి పార్టీల్లో చీలక స్పష్టంగా కనపడుతుంది

Update: 2024-11-05 07:32 GMT

Varma, Pitahapurma Constiuency

పిఠాపురంలో జరగకూడనిది ఏదో జరుగుతుంది. కూటమి పార్టీల్లో చీలక స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుత జనసేన నేతలకు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మకు అసలు పడటం లేదు. పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేలా ఈ ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. గత ఎన్నికల్లో ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మకు టిక్కెట్ దొరకలేదు. కూటమిలో పొత్తులో భాగంగా జనసేనకు పిఠాపురం సీటు వెళ్లిపోయింది. పోటీ చేసింది ఎవరో కాదు. సాక్షాత్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి సిద్ధమవ్వడంతో ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు పిలిపించి మరీ బుజ్జగించడంతో వర్మ ఒకింత మెత్తబడ్డారు.

ఎన్నికల సమయంనుంచే...
తర్వాత పిఠాపురంలో తనను గెలిపించే బాధ్యతను టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మపైనే పవన్ పెట్టారు. నిజానికి పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూవస్తున్నారు. కానీ పిఠాపురంలో జనసేన నేేతలు మాత్రం వర్మను దూరం పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనే వర్మను పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పవన్ కల్యాణ‌్ గెలుపు కోసం వర్మ పనిచేశారు. చివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నా వర్మకు సరైన పదవి దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించినా ఇంతవరకూ చంద్రబాబు కూడా తేల్చలేదు.
విభేదాలు మరింత ముదిరి...
దీంతో జనసేన పిఠాపురం నేతలకు, ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మ కు మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి. వర్మ ను కేర్ చేయడం మానుకున్నారు. అంతా తమదే పాలన అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు సభ్యుడు ప్రోత్సాహంతో జనసైనికులు మరింత రెచ్చిపోతున్నారని వర్మ వర్గీయులు ఆరోపిస్తున్నారు. పిఠాపురానికి పవన పెద్దగా రాకపోకలు చేయకపోవడంతో అక్కడ జనసైనికులదే పై చేయి అయింది. ఏ ప్రభుత్వ పథకం అయినా వారి ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సిందే. వర్మ వెనక ఉండాల్సిందే. దీనిని ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మ వర్గం జీర్ణించుకోలేక పోతుంది. ఫ్రస్టేషన్ కు గురవుతుంది.
వర్మ కోపం నషాళానికి...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పట్టించుకోవడం మానేశారు. దీంతో వర్మ కోపం నషాళానికి అంటింది. దీంతో ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోవర్టులు జనసేనలోకి వచ్చి కుట్రలు పన్నుతున్నారంటూ వర్మ ఫైర్ అయ్యారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్లు వాగుతున్నారంటూ మండిపడ్డారు. దానికి జనసేన బాధ్యత తీసుకోవాలని ఎన్‌విఎస్ఎస్ఎన్ వర్మ కోరారు.కోవర్టులు అధికారం అనుభవించి తిరిగి వెళ్ళిపోతారని, ఆల్రెడీ ఉన్న వారు హర్ట్ అవ్వకుండా జాయినింగ్స్ ఉండాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అనడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన పక్కనే వర్మ ఉండటంతో కొంత జనసేన నేతలకు క్లారిటీ ఇచ్చినట్లయింది. మరి పిఠాపురంలో తలెత్తిన విభేదాలు సమసి పోతాయా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News