Ys Jagan : విసిరిన రాయి.. ఎవరిని ఎటు వైపు తీసుకెళుతుంది.. ఏపీలో హాట్ టాపిక్
వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన దాడితో ఎన్నికల ఫలితాలు మారనున్నాయా? జగన్ పై దాడి ఆయనకు సానుభూతి లభిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకరకంగా విపక్షాలను ఆత్మరక్షణలో పడేశాయి. గత ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి చేసిన ఘటన పట్ల పెద్దగా జనం నుంచి స్పందన లేకపోయినా.. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఎవరో కావాలని చేసినట్లుందన్న అభిప్రాయం కలుగుతుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ పై దాడితో ఫ్యాన్ స్పీడ్ మరింత పెరుగుతుందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
నెలరోజుల వ్యవధిలోనే...
ఎందుకంటే కరెక్ట్ గా నెల రోజుల ముందు జగన్ పై దాడి జరిగింది. వచ్చే నెల 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న విజయవాడలో జగన్ పై దాడి జరిగింది. ముప్ఫయి రోజుల పాటు ఈ దాడిని జనం గుర్తుంచుకునే అవకాశం లేదని విపక్షాలు అంచనా వేసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రజలకు మర్చిపోయే అలవాటు ఎక్కువ. అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకునే అలవాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలది అని అంటున్నారు. అంతే తప్ప ఇలాంటి ఘటనలు విచారకరమైనా.. సానుభూతి పాళ్లు ఇబ్బడి ముబ్బడిగా జగన్ పార్టీపై చూపించే అవకాశం లేదన్న ధీమా విపక్ష నేతల్లో స్పష్టంగా కనపడుతుంది.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు...
అలాగయితే తమ అధినేత చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచిన సానభూతి కూడా పోలింగ్ డే వరకూ కొనసాగాలి కదా? అన్న ప్రశ్న టీడీపీ నేతల నుంచి వస్తుంది. జగన్ పై దాడి దురదృష్టకరం. కావాలని చేసినట్లే కనపడుతుంది. ఎందుకంటే మాటు వేసి మరీ అనువైన స్థలాన్ని ఎంచుకుని అక్కడే దాడి చేశారంటే జగన్ ను లక్ష్యంగానే చేసుకుని దాడికి దిగి ఉండవచ్చన్నది పోలీసులు సయితం అభిప్రాయ పడుతున్నారు. ఏదో ఆకతాయిలు, మద్యం తాగి చేసిన వారి పని అయితే మాత్రం కాదన్నది పోలీసులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఎవరో ప్రొఫెషనల్ దిగి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు సయితం అంగీకరిస్తున్నారు. అందుకే తమ లక్ష్యం గురి తప్పకుండా కొట్టగలిగారంటే వారు పక్కా ప్రొఫెషనల్స్ అని పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.
నిందితులు ఎవరన్నది?
కానీ జగన్ కు మాత్రం గాయాలయ్యాయి. రెండు కుట్లు పడ్డాయి. తగలరాని చోట ఆ రాయి తగిలి ఉంటే పరిస్థితి ఏంటన్న చర్చ కూడా జనంలో మొదలయింది. సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల వైర్లు కూడా కొన్ని కట్ అయి ఉండటం చూస్తే కావాలని చేసిన పని అంటున్నారు. అదను కోసం వేచి చూసిన వాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వైసీీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం నిందితులు ఎవరో తేల్చాల్సిందేనని, ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ను గాయపరిస్తే సానుభూతితో తమకు నష్టమని ఆ మాత్రం తమకు తెలియదా? అని కొందరు టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. మొత్తం మీద జగన్ పై రాయి దాడి మాత్రం రాజకీయంగా ఎవరికి నష్టం చేకూరుస్తుందన్నది మాత్రం కాలమే నిర్ణయించనుంది.