జగన్ సర్కార్ కు భారీ షాకిచ్చిన సుప్రీంకోర్టు
అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరగా.. ప్రతివాదులందరికీ..
జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అత్యవసరంగా అమరావతిపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేయాలని మాజీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆగస్టు నుంచి నవంబరు వరకూ రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని, డిసెంబరు లోగా అమరావతి కేసుపై అత్యవసరంగా విచారణ చేయడం కుదరదని సుప్రీం స్పష్టం చేసింది. అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది.
అమరావతి కేసుపై వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ కోరగా.. ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయినట్లు రైతుల తరపు న్యాయవాదులు వెల్లడించగా.. వారిని జాబితా నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. వారిద్దరినీ తొలగిస్తే.. ప్రతివాదులందరికీ నోటీసులు అందినట్టేనని తెలిపింది. రైతుల తరపు న్యాయవాదులు మాత్రం ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వలేదని చెప్పడంతో.. అందరికీ నోటీసులు పంపాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది.