ఖైదీ నెంబరు 7691
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నెంబరు 7691 కేటాయించారు
ఏదైనా అంతే. కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాల్సిందే. మనం అవతలి వారిని వేలెత్తి చూపించే విమర్శలనే ఒక్కోసారి తాము ఎదుర్కొనాల్సి వస్తుంది. నిప్పు అని చెప్పుకున్నా ప్రయోజనం లేదు. తప్పు జరిగితే శిక్ష అనుభవించాల్సిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బహుశ ఇదే వర్తిస్తుందేమో. ఇప్పటి వరకూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఖైదీనెంబరు 6093 నెంబరుతో పిలుస్తూ ఆయన ఎద్దేవా చేస్తున్న అదే చంద్రబాబుకు ఇప్పుడు తనకు కూడా 7691 నెంబరు కేటాయించడం విధి లిఖితంగానే చూడాలి.
తొలిసారి...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొలిసారి జైలు జీవితం గడిపారు. రాత్రి ఆయనను అత్యంత భద్రత మధ్య పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. స్కిల్ డెవెలెప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఖైదీగా ఉన్నారు. పోలీసులు ఆయన ప్రయాణించే మార్గాల మధ్య భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ప్రయాణమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకున్న ఆయనకు అధికారులు ఖైదీ నెంబరు 7691 నెంబరు కేటాయించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహలోని అప్పర్ బ్లాక్ లో గదిని చంద్రబాబుకు కేటాయించారు.
ప్రత్యేక సౌకర్యాలు...
న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక గదిలో ఉంచారు. అంతేకాదు చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులు కూడా తెప్పించుకునేందుకు అనుమతించారు. ఆయన అర్ధరాత్రి సమయంలో జైలు వద్దకు చేరుకున్నా అప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఫార్మాలటీస్ అన్నీ చకా చకా పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలు జీవితం గడుపుతున్నారు. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు ఆయనకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. జైలులో ఒక సహాయకుడికి అనుమతి ఇచ్చారు. ఐదుగురు సిబ్బందితో జైలులో ప్రత్యేక భద్రతను కల్పించారు. అవినీతి ఆరోపణల కేసులు ఆయన ఎదుర్కొనడం కొత్తేమీ కాదు. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా కోర్టు మెట్లను కూడా ఆయన ఎక్కలేదు. మొత్తం మీద తొలి సారి చంద్రబాబు జైలు జీవితం గడిపక తప్పలేదు.