ఖరీదైన గజదొంగ పోలీస్ అవ్వాలనుకున్నాడట.! పీకే పొలిటికల్ ఎంట్రీపై పేలుతున్న సెటైర్లు

ప్రశాంత కిషోర్ రాజకీయాల్లోకి వస్తాననడం గజదొంగ పోలీసు అవ్వాలనుకున్నట్టు ఉందంటూ ఘాటు సెటైర్లు పేల్చారు టీడీపీ ఎమ్మెల్యే.

Update: 2022-05-02 14:21 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ ఎన్నికల్లో గట్టెక్కేందుకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను సిద్ధం చేసిన ఆయన ఏకంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించడం పెనుసంచలనమే. జాతీయ కాంగ్రెస్‌ పునర్వైభవానికి రిపోర్ట్ తయారు చేసిచ్చిన రాజకీయ వ్యూహకర్త.. సొంత కుంపటి పెట్టుకోవాలని భావించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయనకు బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఏపీ, తమిళనాడు, తెలంగాణలోని అధికార పార్టీలతో సత్సంబంధాలు ఉండడం కూడా కలిసొచ్చే అంశమే.

అంతవరకూ బాగానే ఉన్నా.. ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ప్రకటనపై మాత్రం పలు పార్టీల నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. పీకే సేవలతో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీల నేతలు ఎలా ఉన్నా.. ఆయన వ్యూహాలతో దెబ్బతిన్న ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం ఘాటుగానే స్పందిస్తున్నారు. పీకే మార్క్ స్ట్రాటజీలతో ఏపీలో జగన్ సారథ్యంలోని వైసీపీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే.. అప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం మట్టి కరిచింది. ఎన్నడూ లేనంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ప్రశాంత్ కిషోర్ సైతం ఆ పార్టీకి ప్రత్యర్థిగా మారిపోయారు.

తమ ప్రత్యర్థి కొత్త పార్టీ పెడుతున్నారనడంతో తెలుగు తమ్ముళ్లు గట్టి కౌంటర్లే వేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి రావడమంటే ఖరీదైన గజదొంగ మారిపోయి పోలీసు అవుతానన్నట్టుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. డబ్బులు తీసుకుని ప్రజలను ఏమార్చిన వ్యక్తి పీకే అని.. చెడ్డ వ్యక్తిని కూడా మంచోడిలా చూపించి రాజకీయాలు నడిపారని విమర్శించారు. అలాంటి వ్యక్తి రాజకీయపార్టీ పెట్టడం గజ దొంగ నేను మనసు మార్చుకున్నాను.. పోలీసు అవ్వాలనుకుంటున్నాను అన్నట్టుందని సెటైర్లు పేల్చారు. అలాంటి వ్యక్తి నేరుగా రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.


Tags:    

Similar News