Revanth Redddy : తగ్గేదే లేదంటున్న రేవంత్.. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతాయంటూ సంకేతాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఫర్మ్‌‌గా ఉన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ఆయన ఎవరినీ పట్టించుకోదలచుకోలేదు

Update: 2024-09-04 11:55 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఫర్మ్‌‌గా ఉన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ఆయన ఎవరినీ పట్టించుకోదలచుకోలేదు. చివరకు హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక హైడ్రాతో చెరువులు, కుంటలు, నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఎన్ని వత్తిళ్లు వచ్చినా తగ్గనంటున్నారు. అలాగే తనవాళ్లు.. పరాయి వాళ్లు అని కాకుండా నిర్మాణాలు అక్రమమని తేలితే చాలు నోటీసులు ఇవ్వడం, కూల్చివేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అధికారుల సమీక్షలోనూ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలపై తగ్గేదే లేదని చెప్పారు.

రాహుల్ భుజం తట్టి....
హైడ్రా కూల్చివేతలపై హైకమాండ్ కు మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన నిర్మాణాలను కూల్చివేశారంటూ ఆయన రేవంత్ రెడ్డిపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు కేసీ వేణుగోపాల్ పిలిపించి మరీ హైడ్రా విషయమై ఆరా తీశారు. ఇలా చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటో తెలుసుకున్నారా? అని ప్రశ్నించినట్లు కూడా చెబుతున్నారు. అయితే అదే సమయంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారంటున్నారు. రాహుల్ గాంధీ భుజం తట్టి గో అహెడ్ అంటూ రేవంత్ రెడ్డికి భరోసా ఇవ్వడంతో హైకమాండ్ కూడా హైడ్రా కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.
జిల్లాల్లోనూ ప్రక్రియను...
దీంతో ఇక హైడ్రా కూల్చివేతల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. వర్షాల కారణంగా కొంత స్లో అయినప్పటికీ మళ్లీ హైడ్రా కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమయింది. కాంగ్రెస్ నేతలు కూడా ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను అందిస్తున్నారు. ఇప్పటి వరకూ హైడ్రా కూల్చివేసిన చోట మొన్న కురిసిన భారీ వర్షాలకు నీరు నిల్వక పోవడంతో అక్కడి ప్రజలు రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలను అభినందిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు కొనసాగాల్సిందేనంటూ పెద్దయెత్తున రోజురోజుకూ నగర వాసుల నుంచి మద్దతు పెరుగుతుంది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రావడంతో అందుకు రేవంత్ రెడ్డి ఒకే చెప్పడంతో జిల్లా స్థాయిలో కూడా కూల్చివేతలు త్వరలోనే ప్రారంభమవుతాయంటున్నారు.
కమిషనర్ కూడా...
ప్రస్తుతం భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలకు సహాయక చర్యలపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కొంచెం కుదురుకున్న తర్వాత తిరిగి హైడ్రా అధికారులతో ఆయన సమావేశమవుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైడ్రా కూల్చివేతల ప్రక్రియను వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించనున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాధ్ కూడా తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపి అవి బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయా? అన్న దానిపై నివేదికలను తెప్పించుకుంటున్నారు. పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తర్వాత హైడ్రా కూల్చివేతల ప్రక్రియను వేగవంతం చేస్తుందని చెబుతున్నారు..


Tags:    

Similar News