TDP : సీనియర్ vs జూనియర్స్.. టీడీపీలో నాలుగేళ్ల ముందే వార్ మొదలయినట్లుందిగా?

తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.;

Update: 2025-04-10 06:31 GMT
telugu desam party, seniors, juniors, ap politics
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. గతంలో ఎన్నడూ అంటే నలభై ఏళ్లుగా ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు వర్సెస్ జూనియర్ నేతలకు మధ్య ఒకరకంగా వార్ జరుగుతుందనే అనుకోవాలి. సీనియర్ నేతలను ఎవరినీ జూనియర్ నేతలు లెక్క చేయడం లేదు. జూనియర్లు ఎక్కువ శాతం మంది లోకేశ్ టీంలో ఉండగా, సీనియర్ నేతలు ఇంకా చంద్రబాబు తమను ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టడంతో సీనియర్, జూనియర్ ల మధ్య గ్యాప్ భారీగా ఏర్పడినట్లు స్పష్టంగా తెలిసింది.

మొన్నటి ఎన్నికల్లోనే...
మొన్నటి ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ పాత వారిని పక్కన పెట్టి చాలా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఇచ్చింది. పాత ముఖాలు కావడంతో పాటు గతంలో గెలిచిన సీనియర్ నేతలను మరోసారి ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్న అనుమానం పార్టీ హైకమాండ్ లో బయలుదేరింది. అందుకే సీనియర్ నేతలకు పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారు. వచ్చే నెలలో కడపలో జరగనున్న మహానాడులో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో జూనియర్ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నా ఇంతవరకూ తమకు ఛాన్స్ రాకపోవడానికి సీనియర్ నేతలు అడ్డంకి గా మారుతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది.
సీనియర్ నేతల పట్ల...
ప్రజల్లో కూడా సీనియర్ నేతల పట్ల పెద్దగా సానుకూలత లేదని టీడీపీ హైకమాండ్ పలు మార్లు నిర్వహించిన సర్వేల్లో వ్యక్తం కావడంతో పాటు ఆర్థికంగా బలమైన వారు, సామాజిక వర్గం నేపథ్యం ఉన్న వారు నియోజకవర్గాల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉండటంతో వారు ఈసారి టిక్కెట్ తమదేనన్న ధీమాలో ఉన్నారు. వారంతా నేరుగా పార్టీ యువనేత లోకేశ్ తో టచ్ లోకి వెళ్లి పార్టీ పనులతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే బాధ్యతను భుజానకెత్తుకున్నారు. దీంతో సీనియర్ నేతలు కొంత గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడి పనిచేసిన తమను సీనియారిటీ పేరుతో పక్కన పెడితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని...
మరొకవైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాల స్థానంలో 225 నియోజకవర్గాలకు పెరగనున్నాయి. అంటే 50 నియోజకవర్గాలు పునర్విభజనలో భాగంగా పెరుగుతుండటంతో జూనియర్ నేతలు తమకు ఎక్కడో ఒకచోట టిక్కెట్ దక్కుతుందన్న ఉత్సాహంతో ఉన్నారు. కూటమితో ఎన్నికలకు వెళ్లినా తమకు నియోజకవర్గంలో బలం పెంచుకుంటే తమ పేర్లను పరిశీలించి ఓకే చెబుతారని, వచ్చే ఎన్నికలలో టిక్కెట్ల కేటాయింపులో లోకేశ్ పాత్ర కీలకంగా ఉంటుందని భావించి ఇప్పటి నుంచే యువనేత లోకేశ్ ను మంచి చేసుకునేందుకు జూనియర్ నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో సీనియర్ నేతలు మాత్రం తమకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెబుతున్నారు. మొత్తం మీద టీడీపీ లో సీనియర్ vs జూనియర్ లుగా వార్ ఎన్నికలకు నాలుగేళ్ల ముందే మొదలయింది.










Tags:    

Similar News